ఆదిలాబాద్ అడవుల్లో అన్నల అలజడి మొదలయింది. కైలాష్ టేకిడి అటవి ప్రాంతంలో మావోలు సంచరించారన్న సమాచారంతో పోలీసులు ప్రత్యేక బలగాలతో ఉదయం నుండి అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ కూంబింగ్‌ లో మావోలకు సంబంధించిన ఓ గ్రెనేడ్ లభించినట్లు తెలుస్తోంది. దీంతో మరింత ముమ్మరంగా ఆదిలాబాద్ జిల్లాలో మావోల కోసం పోలీసుల వేట కోనసాగిస్తున్నారు.


మావోయిస్టు పార్టీ కీలకమైన అగ్రనాయకులు ప్రభాత్, భాస్కర్, వర్గీస్, రాము, అనిత సంచరిస్తున్నారని పోలీసులు కూంబింగ్ అపరేషన్ కొనసాగిస్తున్నారు. బోథ్ మండలంలోని కైలాష్ టేకిడి అటవి ప్రాంతంలో ప్రత్యేక పోలీస్ బలగాలు కూంబింగ్ జరుగుతోంది. ఈ కూంబింగ్ లో మావోలకు సంబంధించిన ఓ గ్రేనేడ్ దొరగ్గా.. ఆ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు‌. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. కాని మావోల కోసం భారీగా బలగాలతో కూంబింగ్ మాత్రం జరుపుతున్నారు. దీంతో స్థానికులు అందోళన చెందుతున్నారు.


ఇప్పటికే నిఘా వర్గాల సమాచారంతో కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల ఎస్పీలు మావోయిస్టుల పోస్టర్లను విడుదల చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజా ప్రతినిధులు మారుమూల ప్రాంతాలకు వెళ్లవద్దని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.