విరాట్ కోహ్లీ నుంచి టేక్ ఏ బౌ లాంటి అభినందన తాను ఊహించలేదని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. నిన్న హాంకాంగ్ తో మ్యాచ్ లో బ్యాట్ తో విధ్వంసం సృష్టించిన సూర్య.. కేవలం 26 బంతుల్లో 68 పరుగులు చేసి హీరోగా నిలిచాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీ నుంచి సూర్య టేక్ ఏ బౌ అందుకున్నాడు.


ఈ అభినందన ప్రత్యేకం 


దీనిపై సూర్య స్పందించాడు. అంత అనుభవం ఉన్న స్టార్ బ్యాట్స్ మెన్ నుంచి అలాంటి అభినందన రావడం చాలా ఆనందంగా ఉందన్నాడు. విరాట్ ఎంతో అనుభవమున్న ఆటగాడని.. అంతేకాక ఎన్నో మ్యాచుల్లో భారత్ ను ముందుండి నడిపించాడని సూర్య చెప్పాడు. మ్యాచ్ అయిన తర్వాత కోహ్లీ వెళ్లిపోకుండా తనకోసం చూశాడని.. తనను ముందు నడవవలసిందింగా సూచించాడని సూర్య తెలిపాడు. అది తాను ఊహించలేదని అన్నాడు. తర్వాత ఇద్దరం కలిసే వెళ్లామని వెల్లడించాడు.


అతనితో ఆట ఆస్వాదించాను 


విరాట్ కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని తాను ఆస్వాదించానని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. తాను బ్యాటింగ్ కు వచ్చేసరికి 2 వికెట్లు పడ్డాయని.. అలాంటి స్థితిలో అనుభవం ఉన్న కోహ్లీ లాంటి ఆటగాడి అవసరం ఎంతైనా ఉంటుందన్నాడు. అలాంటి అనుభవం ఉన్న వ్యక్తి చివరి వరకు క్రీజులో ఉండాలని తాను కోరుకున్నానని తెలిపాడు. 


కోహ్లీతో మాట్లాడా


తాను క్రీజులోకి వచ్చేసరికి పిచ్ కొంచెం నెమ్మదిగా ఉందని సూర్య అన్నాడు. ఆ సమయంలో విరాట్ కోహ్లీతో మాట్లాడానని తెలిపాడు. తన సహజసిద్ధమైన ఆట ఆడాలని విరాట్ సూచించాడని సూర్య తెలిపాడు. తన మనసులోనూ అదే ఉందని.. దాంతో తనకు నచ్చినట్లుగా మొదటినుంచి దూకుడుగానే ఆడానని వివరించాడు. 


టచ్ లోకి విరాట్


హాంకాంగ్ తో మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 44 బంతుల్లో 59 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 3 సిక్సులు ఉన్నాయి. ఈ మ్యాచ్ తో కోహ్లీ ఫామ్ లోకి వచ్చినట్లు కనిపించాడు. కొన్ని మంచి షాట్లు ఆడాడు. చివరి వరకు క్రీజులో నిలబడ్డాడు.