BJP TDP Alliance : తెలంగాణలో బీజేపీ-టీడీపీ పొత్తుపై ఎంపీ కె.లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, టీడీపీతో పొత్తు అని వస్తున్న వార్తలు కేవలం వార్తలు మాత్రమే అన్నారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. ఏపీలో జనసేనతో కలసి పోటీ చేస్తుందన్నారు. ఏపీలో రోజురోజుకు బీజేపీ బలపడుతోందన్నారు. బీజేపీ, టీడీపీ పొత్తుపై ఎలాంటి చర్చలు జరగడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ పొత్తులపై మాట్లాడారు. ఎన్డీయేలోకి టీడీపీ వస్తోందన్న ప్రచారంపై విలేకరులు అడిన ప్రశ్నలకు లక్ష్మణ్ స్పందించారు. అది కేవలం ప్రచారమేనని, అందులో వాస్తవం లేదన్నారు. ఏపీలో సీఎం జగన్ పై ప్రజావ్యతిరేకతను బీజేపీకి అనుకూలంగా మలచుకుంటున్నామన్నారు. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.
అవకాశవాదుల సమావేశం
తెలంగాణలో బీజేపీ బలపడుతోందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ గట్టిపోటీ ఇస్తుందన్నారు. ఇటీవల ఎన్నికల్లో ప్రతీచోట బీజేపీ గెలిచిందన్నారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా మునుగోడు ఉపఎన్నికలో బీజేపీదే విజయమన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయమని ప్రజలు భావిస్తున్నారన్నారు. అందుకే కేసీఆర్ సహించలేకపోతున్నారని లక్ష్మణ్ చెప్పారు. సీఎం కేసీఆర్ బిహార్ పర్యటనపై ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. ఇద్దరు అవకాశవాదుల మధ్య జరిగిన సమావేశమని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు తెలంగాణలో గెలవడం చేతకాక బయట రాష్ట్రాలకు వెళ్లి హడావుడి చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ వైఖరి చూస్తుంటే మజ్లిస్‌తోనే కాకుండా కాంగ్రెస్‌తోనూ పొత్తు పెట్టుకునే అవకాశం కనిపిస్తోందన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకే విధానాలతో కొనసాగుతున్న కుటుంబ పార్టీలని ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు.
తెలంగాణ అమరులు గుర్తులేరా?
గల్వాన్ అమరవీరుల కుటుంబాలతో పాటు సికింద్రాబాద్ అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించడంలో తప్పులేదు కానీ తెలంగాణ అమరుల కుటుంబాలను ఎందుకు ఆదుకోవడంలేదని ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలు, కొండగట్టు మృతుల కుటుంబాలకు సాయం చేసేందుకు కేసీఆర్ కు మనసు రావడంలేదన్నారు. ప్రభుత్వ వైఫల్యంతో 26 మంది ఇంటర్ విద్యార్థులు చనిపోతే సీఎం కేసీఆర్ ఎందుకు ఆర్థికసాయం చేయలేదని ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు.
ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు దిల్లీలో ప్రధాని మోదీని కలవడం, అంతకు ముందు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ ఎన్డీయేకి మద్దతు ప్రకటించడంతో బీజేపీ-టీడీపీ పొత్తులపై ఊహాగానాలు వచ్చాయి. మళ్లీ టీడీపీ ఎన్డీయేలో జాయిన్ అవుతుందని, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతున్నారని, ఈ భేటీలో పొత్తులపై చర్చిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఇవి కేవలం ప్రచారం మాత్రమే అని వాస్తవం కాదని బీజేపీ టీడీపీతో ఎలాంటి పొత్తు పెట్టుకోవడంలేదని ఎంపీ లక్ష్మణ్ తేల్చేశారు.
Also Read : Telangana Early Elections : తెలంగాణలో మళ్లీ ముందస్తు ఊహాగానాలు - కేబినెట్ భేటీ వైపే అందరి చూపు !
Also Read : Munugode: మేం కేసీఆర్‌ని వాడుకుంటున్నాం, అందుకే మునుగోడులో సపోర్ట్ చేస్తాం - తమ్మినేని