Kamareddy News : కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. నిజాంసాగర్ మండలం బూర్గుల్ లో బీజేపీ నాయకులు ఆ పార్టీ జెండాను ఆవిష్కరించేందుకు నిర్ణయించారు. అయితే ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పల్లె ఘోష-బీజేపీ భరోసా పేరుతో బీజేపీ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నిజాంసాగర్ మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ నేతలు ఆ పార్టీ జెండాలను ఆవిష్కరిస్తున్నారు. గురువారం నిజాంసాగర్ మండంలోని బూర్గుల్ గ్రామంలో టీఆర్ఎస్, బీజేపీ నాయకులు జెండా ఆవిష్కరణపై పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట
బీజేపీ జెండా ఆవిష్కరించేందుకు ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున శుక్రవారం బూర్గుల్ గ్రామానికి చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. సీఎం కేసీఆర్ అవినీతి పాలన అంతం కావాలని బీజేపీ శ్రేణులు నినాదాలు చేశారు. పోలీసుల నుంచి తప్పించుకున్న బీజేపీ నాయకులు బూర్గుల గ్రామంలో ఆ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ తన కార్యక్రమాలను కొనసాగించారు.
‘బండి సంజయ్‌ను ED చీఫ్‌గా పెట్టినందుకు థ్యాంక్స్’, మోదీకి కేటీఆర్ సెటైర్లు
నియంతృత్వ పాలన- మాజీ ఎంపీ వివేక్
అయితే అంతకు ముందు మాట్లాడిన మాజీ ఎంపీ వివేక్...పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా బూర్గుల్ కమాన్ దగ్గర బీజేపీ జెండా ఎగురవేస్తామని వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. దాడిని టీఆర్ఎస్ ప్రభుత్వం పిరికిపంద చర్యగా మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకుని పాలన చేస్తున్నారని విమర్శించారు. బూర్గుల్ లో జెండా ఎగరవేసే వెళ్తామన్నారు. నిజాంసాగర్ మండలం బూర్గుల్ గ్రామంలో పోలీసుల తీరుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. శాంతియుతంగా జెండా ఎగురవేసేందుకు వెళ్తోన్న బీజేపీ నేతలను అడ్డుకోవడం సరికాదన్నారు. బీజేపీ నేతలను బలవంతంగా తీసుకెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : YS Sharmila: తెలంగాణ సర్కారుపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు, ఏమంటుందంటే?