Telangana Congress MLA Rajagopal Reddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగలనుంది! ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అతి త్వరలో పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. తాజాగా పార్టీ మార్పు గురించి రాజగోపాల్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీలో చేరుతానని పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూ సంకేతాలు ఇచ్చారు. నిజానికి ఈయన పార్టీ మారతారని గతంలోనే విపరీతమైన ప్రచారం జరిగింది. కానీ, ఆ విషయం తెరమరుగుకు వెళ్లిపోయింది. తాజాగా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పనున్నట్లుగా రాజగోపాల్ రెడ్డి పరోక్ష వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం మరోసారి చర్చనీయాంశం అయింది. 


నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు అతి త్వరలోనే ఆయన బీజేపీలో చేరతారని అవగతం అవుతోంది. బీజేపీ అంటే కేసీఆర్ కు భయం పట్టుకుందని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడిస్తారని కామెంట్ చేశారు. కేసీఆర్‌ను ఓడించే పార్టీలో చేరతానని.. తాను ఏం చేస్తానో త్వరలో ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు. డెవలప్ మెంట్ నిధులు తన నియోజకవర్గానికి రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. తాను అమిత్ షాను కలిసిన మాట నిజమేనని చెప్పారు.


రహస్య సమావేశం
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బుధవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ ముఖ్యనేత అయిన అమిత్‌షాతో రహస్యంగా సమావేశం అయినట్లుగా బీజేపీ నేతలు తెలిపారు. వారు ఇద్దరూ దాదాపు 45 నిమిషాలపాటు మాట్లాడుకున్నట్లుగా సమాచారం. ఇందుకోసం బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేతో కలిసి అమిత్ షాను రాజగోపాల్ రెడ్డి కలిసినట్లుగా సమాచారం.


చాలా కాలం నుంచి అసంతృప్తి
తెలంగాణ కాంగ్రెస్‌లో పరిణామాలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా నియామకం అయ్యేందుకు ముందు ఆయన పార్టీ మారతారంటూ చాలా కథనాలు వచ్చాయి. అయితే సీనియర్లు నచ్చచెప్పడంతో ఆయన ఆలోచనను విరమించుకున్నారు. కొన్నాళ్లుగా రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ అధికారిక కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై కూడా అనేకసార్లు విమర్శలు చేశారు. గతంలో నల్గొండ జిల్లాలో రేవంత్‌రెడ్డి సభ పెట్టకుండా ప్రయత్నించడం వంటి పరిణామాలు కాంగ్రెస్‌ను వీడడం తథ్యం అనే సంకేతాలు కూడా ఇచ్చాయి.