Polavaram Issue: నిన్నటి వరకు ఎవరి రాజకీయాలు వాళ్లవే. కానీ ఇప్పుడు మళ్లీ తెలుగు రాష్ట్రాల మధ్య రగడ మొదలైంది. అందుకు కారణం మళ్లీ ప్రాజెక్టులే. రెండేళ్ల క్రితం పోతిరెడ్డి పాడు ఎత్తు పెంపు... తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య రచ్చకు కారణమైంది. ఇప్పుడు పోలవరం వేదికగా మారింది. ఎన్నడూ లేని విధంగా జులైలోనే భారీ వర్షపాతం నమోదు అయ్యింది. 100 ఏళ్లల్లో గోదావరికి ఇంత వరద రావడం ఇదే మొదటి సారి అని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. ఇప్పుడీ వరద రాజకీయాలకు పోలవరం కేంద్ర బిందువుగా మారింది.
రెండ్రోజుల్లోనే ప్రాజెక్టు ఎత్త, వెడల్పును పెంచారు..
భారీ వరదలతో భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 70 అడుగుల చేరి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. అధికార యంత్రాంగంతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఒకానొక దశలో భద్రాద్రి ప్రజలను ఎలా కాపాడగలుగుతామా అన్న టెన్షన్ కి గురయ్యారు. గోదావరి వరద తెలంగాణనే కాదు ఏపీని కూడా కంగారు పెట్టింది. దీంతో జగన్ సర్కార్ ఆఘమేఘాల మీద పోలవరం ఎగువ కాఫర్ డ్యాం 2.5కిమీ పొడవునా ఒక మీటర్ ఎత్తు, 2 మీటర్ల వెడల్పుని పెంచింది. రెండు రోజుల్లోనే ఈ పనులను పూర్తి చేసింది. ఇప్పుడు ఎత్తు పెంపు రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ గొడవకు కారణమైంది. భద్రాచలంకి ఇంతటి వరద రావడానికి పోలవరమే కారణమనీ, ఎత్తు కూడా మరో సమస్య అని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ చేసిన కామెంట్లు రాజకీయ అలజడిని రేపాయి. దీనిపై రెండు రాష్ట్రాల మంత్రులు ఎవరి స్టైల్లో వాళ్లు ఆరోపణలు, విమర్శలకు దిగి నీటి యుద్ధాలకు కారణం అవుతున్నారు.
సీఎం కేసీర్, సీఎం జగన్ ల మధ్య గొడవ..
గతంలో కూడా ఇలానే పోతిరెడ్డిపాడు విషయం రెండు రాష్ట్రాల మధ్య రచ్చకుకారణమైంది. అప్పటి వరకు స్నేహగీతం పాడుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్ర సీఎం జగన్ పోతిరెడ్డి పాడు విషయంలో పొట్లాటకు దిగారు. ఎత్తు పెంపుతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కేసీఆర్ ఆరోపించారు. దీనికి పోటీగా జగన్ కూడా కాలు దువ్వారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ అన్యాయం చేస్తోందని లెక్కలతో సహా కృష్ణా ట్రిబ్యునల్ కి ఫిర్యాదు చేశారు. అప్పుడు కృష్ణా.. పోతిరెడ్డి పాటు ఇప్పుడు గోదావరి పోలవరం తెలుగు రాష్ట్రాల మధ్య తగువులాటకు కేరాఫ్ గా మారింది. ఎప్పటి నుంచో భద్రాచలాన్ని ఏపీలో కలపాలని ఆరాష్ర్ట ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ఇప్పటికే పోలవరం పరిధిలోకి వచ్చే 7 మండలాలు ఏపీలోనే ఉన్నాయి. భద్రాచలాన్ని కూడా ఏపీకి కేటాయిస్తే బాగుంటుందని స్పష్టం చేసింది. అయితే ఇందుకు తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.
పోలవరంతో మరోసారి చిచ్చు..
ఆ తర్వాత ఈ విషయం గురించి అందరూ మర్చిపోయారు. కానీ ఇప్పుడు మళ్లీ పోలవరంతో భద్రాచలం విలీనంపై చర్చ మొదలైంది. ఓ వైపు మంత్రి అజయ్ తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలంతా ముక్త కంఠంతో భద్రాచలాన్ని ఆనుకొని ఉన్న 5 గ్రామాలు పిచుకులపాడు, ఏటపాక, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, గుండాలను తెలంగాణలో కలపాలనే కొత్త డిమాండ్ తీసుకొచ్చారు. మరోవైపు ప్రస్తుత వరద పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పక్కదారి పట్టించేందుకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అటెన్ష్ న్ డైవర్షన్ కార్యక్రమంలో భాగంగా ఒకరిపై మరొకరు జెట్ స్పీడ్ లో విమర్శలు చేసుకుంటున్నారని ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే వరదలు, నష్టాలు, ప్రజల బాధలపై చర్చించాల్సిన నేతలు ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.