Kamareddy News : కామారెడ్డిలో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ, టీఆర్ఎస్ ప్రజా దర్బార్ రణరంగంగా మారింది. కామారెడ్డి మున్సిపాలిటీ వద్దకు ర్యాలీగా వచ్చిన టీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల సవాళ్లు, ప్రతిసవాళ్లు పోలీసులకు తలనొప్పిగా మారింది. 


అసలేం జరిగింది? 


బీజేపీ, టీఆర్ఎస్ ప్రజాదర్బార్ కార్యక్రమంతో కామారెడ్డి మున్సిపాలిటీ రణరంగంలో మారింది. టీఆర్ఎస్, బీజేపీ సవాళ్లు ప్రతి సవాళ్లు పోలీసుల సహనానికి పరీక్ష పెట్టింది. ప్రజాదర్బారు అనుమతి లేదన్న పోలీసులు మున్సిపల్ కార్యాలయ గేటును మూసివేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం10 గంటలకు ప్రజాదర్బార్ నిర్వహిస్తామని బీజేపీ పిలుపునివ్వగా టీఆర్ఎస్ నాయకులు ఉదయం 9:50కి ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. బారీకేడ్లను తోసుకుని మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు. టీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, టీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. 


ప్రజలకు క్షమాపణ చెప్పాలి


టీఆర్ఎస్ నాయకుడు వేణుగోపాల్ రావు మాట్లాడుతూ ప్రజాదర్బార్ కార్యక్రమానికి వస్తానని చెప్పిన వెంకట రమణారెడ్డి తోక ముడిచారని మండిపడ్డారు. దమ్ముంటే మున్సిపల్ కార్యాలయానికి రావాలని సవాల్ విసిరారు. అనవసర ఆరోపణలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకునే రమణారెడ్డి వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు బీజేపీ నాయకులు మున్సిపల్ ఆఫీస్ వద్దకు రాకుండా మోర్ మార్కెట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. 



బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం


కామారెడ్డి బల్దియాలో అవినీతి, కబ్జాలు, అక్రమ భూదందాలపై బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సవాళ్లు, ప్రతిసవాళ్లతో ప్రజాదర్బార్ పేరుతో ఇరు పార్టీలు బహిరంగ చర్చకు సిద్ధం అయ్యాయి. టీఆర్ఎస్ నాయకుల అవినీతి అక్రమాలను ప్రజల ముందు పెడతామని బీజేపీ నాయకులు ప్రకటించారు. దీంతో బీజేపీ సవాల్ ను టీఆర్ఎస్ నేతలు స్వీకరించారు. దీంతో రెండు పార్టీల నేతలు కామారెడ్డి మున్సిపాలిటీ దగ్గరకు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దాదాపు 300 మంది పోలీసు సిబ్బందితో మున్సిపల్ కార్యలయం దగ్గర భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.


Also Read : RFCL: పెద్దపల్లి RFCL ఫ్యాక్టరీకి పొల్యుషన్ బోర్డు షాక్! మళ్లీ రైతులకు కష్టాలు తప్పవా?


Also Read : Crore Rupees in HDFC Account: సామాన్యుడి బ్యాంకు ఖాతాలో రూ.18.52 కోట్లు జమ, లబోదిబో మంటున్న బాధితుడు - ఎందుకంటే !