JP  nadda :  బీజేపీ నేతలంతా గ్రామాలకు వెళ్లాలని, ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  ఆదేశించారు. మేడ్చల్ లో  బీజేపీ స్టేట్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.  పదో తరగతి క్వశ్చన్ పేపర్, టీఎస్ పీఎస్సీ లీకేజీలకు పాల్పడిన ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన అవసరం ఉందని నాయకులు, కార్యకర్తలకు సూచనలు చేశారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ వల్ల 30 లక్షల మంది యువత జీవితాలు ఆగమయ్యాయని నడ్డా ఆవేదన వ్యక్తంచేశారు. రజాకార్లతో చేతులు కలపడానికి కేసీఆర్ సిగ్గుండాలి అని నడ్డా ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలనే కాకుండా.. ఇవ్వని హామీలను సైతం అమలు చేస్తున్న పార్టీ బీజేపీ అని స్పష్టం చేసారు. 


మోదీ నేతృత్వంలో  అగ్రస్థానంలో నిలిచిన దేశం                             
 
ప్రధాని మోడీ నేతృత్వంలోనే దేశం అగ్రగామిగా నిలిచిందని నడ్డా తెలిపారు. ఐఎంఎఫ్ నివేదిక ప్రకారం భారత్‌లో 13 కోట్ల మంది పేదరికాన్ని జయించారని పేర్కొన్నారు. ఎన్నో ఏండ్లు పాలించిన కాంగ్రెస్ తెలంగాణను ఎందుకు అబివృద్ధి చేయలేదని నడ్డా ప్రశ్నించారు. పీఎం అవాస్ యోజన కింద దేశ వ్యాప్తంగా 4 కోట్ల ఇళ్లను కేంద్రం నిర్మించిందని, మరి తెలంగాణలో కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారా? అని నిలదీశారు. ఉజ్వల పథకం కింద సిలిండర్‌కి రూ.300 సబ్సిడీ ప్రకటించామని, దీంతో 9.50 కోట్ల మందికి లబ్ధి చేకూరనుందని నడ్డా వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 12 కోట్ల మంది రైతుల అకౌంట్‌లో కేంద్రం డబ్బులు జమ చేస్తోందని, ఇందులో 38.50 లక్షల మంది తెలంగాణ రైతులు ఉన్నారని ఆయన తెలిపారు. తెలంగాణకు మోడీ ఇచ్చిన ప్రతి పథకాన్ని ప్రజలకు వివరించాలని ఆయన నాయకులు, కార్యకర్తలను కోరారు. 


తెలంగాణోల బీజేపీ గెలవాలి  !


తెలంగాణలో బీజేపీ గెలవాలని, మరోసారి కేంద్రంలోనూ అధికారంలోకి తీసుకురావాలని నడ్డా దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో రోడ్లు ఎలా ఉన్నాయో పరిశీలించాలని నడ్డా సూచించారు. తొమ్మిదేండ్లలో రాష్ట్రానికి రూ.9 లక్షల కోట్లను కేంద్రం కేటాయించిందని తెలిపారు. ప్రజా సంక్షేమం పట్టని సీఎం కేసీఆర్ ను గద్దె దించాల్సిన అవసరం ఉందని నడ్డా ముఖ్య నేతలకు సూచనలు చేశారు. తెలంగాణ ముఖ్య నేతలతో పాటు ఎన్నికల కోసం నియమించిన కేంద్ర కమిటీ సభ్యులూ హాజరయ్యారు.                


నడ్డాతో ప్రత్యేకంగా సమావేశం అయిన కోమటిరెడ్డి, విజయశాంతి                               


బీజేపీలో రెబల్ లీడర్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. ఘట్ కేసర్ లో వీబీఐటీ కాలేజీలో నడ్డాను ఇరువురు నేతలు కలిశారు. కాగా నడ్డా వారితో విడివిడిగా భేటీ అయ్యారు. కొద్ది రోజులుగా పలువురు సీనియర్లు తమకు ప్రియారిటీ దక్కడంలేదని పార్టీ యాక్టివిటీకి అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. ఇటీవల ప్రధాని మోడీ సభలకు, రాష్ట్ర పదాధికారుల సమావేశానికి సైతం వారు గైర్హాజరయ్యారు. తమ సమస్యలను పార్టీ హైకమాండ్ కు చెప్పుకుని అక్కడే తేల్చుకుంటామని వారు భావించారు. కాగా, వీబీఐటీలో నిర్వహిస్తున్న పార్టీ కౌన్సిల్ మీటింగ్‌కు హాజరై వారు నడ్డాను కలవడం ఆసక్తికరంగా మారింది. దీంతో వారు ఎలాంటి అంశాలపై చర్చించారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.