Mla Thatikonda Rajaiah : స్టేషన్ ఘనపూర్ లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలకు తనను ఆహ్వానించడంలేదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆవేదన చెందారు. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజయ్య స్పందించారు. జనగాం జిల్లా చిల్పూర్ మండలం వెంకటాద్రిపేటలో ఎమ్మెల్యే రాజయ్య మీడియాతో మాట్లాడారు. ఆత్మీయ సమావేశాలకు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లుగా ఎమ్మెల్సీలను ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారన్నారు. నల్గొండకు కడియం శ్రీహరిని ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు ఇవ్వడం వల్లే ఆయనను పిలవడంలేదన్నారు. 4వ తేదీన స్టేషన్ ఘనపూర్ లో జరిగే క్లస్టర్ 1 ఆత్మీయ సమావేశానికి కడియం శ్రీహరిని ఆహ్వానిస్తామని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు. 


"సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు ఎమ్మెల్సీలను ఇన్ ఛార్జ్ లుగా నియమించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు కోటిరెడ్డిని ఇన్ ఛార్జ్ గా వేశారు. ఘనపూర్ నియోజకవర్గంలో 14 సమావేశాలు జరగనున్నాయి. ఒక్కొ సమావేశానికి ఒక్కొరిని గెస్ట్ గా ఆహ్వానిస్తాం. వీలైనంత వరకూ అవకాశాన్ని అందర్నీ ఆహ్వానిస్తాం. కడియం శ్రీహరి నల్గొండకు ఇన్ ఛార్జ్ గా ఉన్నారు. వారి సమయం తీసుకుని 4వ తేదీన ఘనపూర్ క్లస్టర్ 1 ఆత్మీయ సమావేశానికి పిలుస్తాం. కార్యకర్తలో మాట్లాడుతున్నాం వాళ్లను ప్రజలకు వారధులుగా ఉండే విధంగా సిద్ధం చేస్తున్నాం. మేనెల వరకూ ఈ సమావేశాలు పొడిగించారు."-ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య


ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఏమన్నారంటే? 


వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో జరిగే ఆత్మీయ సమావేశాలకు ఎమ్మెల్యే రాజయ్య తనకు సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చినప్పుడు, పెద్ద పెద్ద సమావేశాలకు, సభలకు తనను వాడుకుంటున్నారని.. ప్రభుత్వపరంగా కార్యక్రమాలకు, సమావేశాలకు తనను పిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  ఎన్నికల అప్పుడు ఎమ్మెల్యే రాజయ్య తనకు సహాయం చేయమని అడగడంతో, పార్టీ నిర్ణయానికి కట్టుబడి సొంత డబ్బులు ఖర్చు పెట్టి పని చేశానని గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా ఒక్క రూపాయి ఆశించకుండా నిస్వార్థంగా పనిచేశానని అన్నారు. స్వయంగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి.. మీరు ఒక్కరే డబ్బులు తీసుకోకుండా పని చేశారని కొనియాడారని కడియం చెప్పారు. 


స్టేషన్ ఘన్ పూర్ లో జరిగే ఆత్మీయ సమావేశాలకు తనకు ఆహ్వానం ఇవ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను ఎమ్మెల్యే రాజయ్య బేఖాతర్ చేశారని మండిపడ్డారు. నాకు అవకాశం ఉన్నప్పుడు కూడా నిజాయతీగా పని చేశానని అన్నారు. మొన్నటికి మొన్న సోడాషపల్లి కేటీఆర్ బహిరంగ సభలో కడియం శ్రీహరి అంటే ఏమిటో అందరికీ అర్థమైంది అని అన్నారు. ఇప్పటికైనా ఆత్మీయ సమావేశాలకు సమాచారం లేకపోతే పార్టీలో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఎప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడే ఉంటానని అన్నారు.