IPL 2023, Jos Buttler: 


సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచులో రాజస్థాన్ రాయల్స్‌ ఓపెనర్లు విధ్వంసం సృష్టించారు. పటిష్ఠమైన హైదరాబాద్‌ బౌలర్లకే చుక్కలు చూపించారు. పవర్‌ప్లే 6 ఓవర్లు ముగిసే సరికే వికెట్‌ నస్టానికి 85 పరుగులు చేశారు. ఇంగ్లాండ్‌ విధ్వంసక ఆటగాడు, జోస్‌ బట్లర్‌ (54; 22 బంతుల్లో 7x4, 3x6) అరాచకం సృష్టించాడు. క్రీజులో నిలబడి మరీ సిక్సర్లు దంచికొట్టాడు. భువనేశ్వర్‌, ఫజల్‌హక్ ఫారూఖీ, వాషింగ్టన్‌ సుందర్‌, టి నటరాజన్‌.. అతడి ముందు తేలిపోయారు. ఎక్కడ బంతులేసినా స్టాండ్స్‌లోకి తరలిస్తుండటంతో ఏం చేయాలో వారికి అర్థమవ్వలేదు. వరుస పెట్టి బౌండరీలు, సిక్సర్లు  దంచికొట్టడంతో చూస్తూ ఉండిపోయారు.




మరో ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ (32; 14 బంతుల్లో 6x4) సైతం బట్లర్‌కు తోడుగా చెలరేగాడు. అతడితో కలిసి తొలి వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యం అందించాడు. వీరిద్దరి దెబ్బకు రాజస్థాన్‌ రాయల్స్‌ 3.4 ఓవర్లకే 50 స్కోరు చేసింది. బట్లర్‌ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. అయితే ఫారూఖీ వేసిన 5.5వ బంతికి బట్లర్‌ మిడిల్‌ వికెట్‌ ఎగిరిపోయింది. అప్పటికి ఊచకోత కాస్త తగ్గింది. మొత్తానికి ఓపెనర్ల విధ్వంసంతో రాజస్థాన్‌ రాయల్స్‌ ఐపీఎల్‌ రికార్డులు తిరగరాసింది. లీగ్‌ చరిత్రలోనే పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా అవతరించింది. బట్లర్‌ ఔటవ్వడంతో కెప్టెన్‌ సంజూ శాంసన్‌ క్రీజులోకి వచ్చాడు.


Sunrisers Hyderabad vs Rajasthan Royals: ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ మొదటి మ్యాచ్ ఆడటానికి సిద్ధం అయింది. రాజస్తాన్ ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు సవాలు విసరనుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.




రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్, వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, KM ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్


సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు
మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, ఆదిల్ రషీద్, భువనేశ్వర్ కుమార్ (కెప్టెన్), ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, ఫజల్హాక్ ఫరూఖీ