బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి వయసురీత్యా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న జంగారెడ్డి శనివారం ఉదయం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. 1984లో బీజేపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీలలో జంగారెడ్డి ఒకరు. రెండు సార్లు జన సంఘ్ నుండి ఎమ్మెల్యేగా సేవలు అంనదించిన సీనియర్ నేత జంగారెడ్డి ఆకస్మిక మృతి పట్ల పార్టీ సీనియర్ నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు. 


జంగారెడ్డి పార్థివదేహాన్ని హైదరాబాద్ నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 9:30 నుండి 10:30 గంటల వరకు పార్టీ నేతలు, కార్యకర్తలు నివాళులర్పిస్తారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పార్టీ సీనియర్ నేత తొలితరం బీజేపీ నేత జంగారెడ్డికి నివాళి అర్పించారు. జన సంఘ్‌ను, బీజేపీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి ఎంతో కృషి చేసిన నేతలతో జంగారెడ్డి ఒకరు. పార్టీ క్లిష్టమైన పరిస్థితులో ఉన్నప్పుడు తన వంతుగా విశేషంగా శ్రమించిన జంగారెడ్డి మరణం పార్టీకి తీరని లోటు అని పార్టీ ప్రముఖులు అంటున్నారు.


మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి మృతిపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, కేంద్ర పర్యాటక సాంస్కృతిక అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సీనియర్ నాయకులు, మార్గదర్శకులు జంగారెడ్డి మరణం బీజేపీకి తీరని లోటు అన్నారు. జంగారెడ్డి మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం సానుభూతిని తెలియజేశారు.






ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాలకు చెందిన చందుపట్ల జంగారెడ్డి 18 నవంబర్ 1935న జన్మించారు. 1953లో సి.సుధేష్ణను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన కొంతకాలం నుంచి హన్మకొండలో నివాసం ఉంటున్నారు. 1984లో బీజేపీ పార్టీ నుంచి ఇద్దరు నేతలు ఎంపీలుగా లోక్‌సభకు ఎంపిక కాగా, అందులో ఒకరైన జంగారెడ్డి మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై భారీ మెజార్టీతో హనుమకొండ పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించారు. వాజ్‌పేయ్, అద్వానీ లాంటి హేమాహేమీలు ఓటమి పాలైన తొలి ఎన్నికల్లో ఉమ్మడి ఏపీ నుంచి జంగారెడ్డి విజయం సాధించడం విశేషం.


Also Read: Modi Hyderabad Visit: ప్రధానికి ఘన స్వాగతం పలకనున్న కేసీఆర్, పర్యటన ముగిసేదాకా ఆయన వెంటే.. పూర్తి షెడ్యూల్


Also Read: Owaisi Rejects Z Security: నాకు చావంటే భయం లేదు.. Z కేటగిరీ భద్రత అవసరం లేదు: ఓవైసీ