ఏపీ, తెలంగాణలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రాల అధికారులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. అదే సమయంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా తక్కువ ఎత్తులో నేడు నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకూ ఎలాంటి వర్షం ఉండబోదని వెల్లడించారు. అలాగే వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా వేశారు.


ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. కనిష్ణ ఉష్ణోగ్రతలు నెమ్మదిగా పెరిగే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.






‘‘అనంతపురం, కర్నూలు జిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది. అత్యల్పంగా అనంతపురం జిల్లా మడకశిరలో 12.2 డిగ్రీలు నమోదయ్యింది. కర్ణాటక కి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. మరో వైపున పొగ మంచు తిరుపతి, చిత్తూరు జిల్లా తూర్పు భాగాలు, నెల్లూరు జిల్లా దక్షిణ భాగాల్లోకి విస్తరిస్తోంది. గోదావరి జిల్లా భీమవరం పరిశరాల్లో కూడ పొగ మంచు విస్తరిస్తోంది. నగరాల వారీగా కర్నూలులో అత్యల్పంగా 15.3 డిగ్రీలు నమోదయ్యింది. చలి తీవ్రత గత వారంతో పోలిస్తే తక్కువగానే ఉంది. మళ్లీ ఈ రోజు మధ్యాహ్నం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎండ, కాస్త వేడిగా ఉంటుంది.’’ అని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.



తెలంగాణలో ఇలా..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. రాష్ట్రమంతా ఎలాంటి వర్ష సూచన లేదు. వాతావరణం అంతా పొడిగానే ఉంటుంది. కానీ, రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితే మరో మూడు నాలుగు రోజులు ఉండనుందని అంచనా వేశారు.


హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం సమయంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంది. నిర్మలంగా ఉంటుంది. ఉదయం సమయంలో కొన్ని చోట్ల పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు, 17 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంటుంది. వాయువ్య దిశ ఉపరితల గాలులు గంటకు 6 కిలో మీటర్ల నుంచి 8 కిలో మీటర్ల వరకూ వీచే అవకాశం ఉంటుంది. ముందు రోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 29.6 డిగ్రీలుగా, కనిష్ఠ ఉష్ణోగ్రత 19.4 డిగ్రీలుగా నమోదైంది.