కేంద్ర ప్రభుత్వం తనకు ఇచ్చిన Z కేటగిరీ భద్రతను ఏఐఎమ్ఐఎమ్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తిరస్కరించారు. తనకు ఎలాంటి భద్రతా అవసరంలేదని ఇలాంటి దాడులకు పాల్పడుతోన్న వారిని కఠినంగా శిక్షించాలని లోక్‌సభలో డిమాండ్ చేశారు.
నాకు చావంటే భయం లేదు. నాకు Z కేటగిరీ సెక్యూరిటీ అవసరం లేదు. దానిని నేను తిరస్కరిస్తున్నాను. నన్ను A కేటగిరీ పౌరుడిగా ఉండనివ్వండి. నేను నిశ్శబ్దంగా ఉండను. న్యాయం జరగాల్సిందే. నా వాహనంపై కాల్పులు చేసినవారిపై యూఏపీఏ అభియోగాలు మోపాలి. ద్వేషానికి, మత విద్వేషానికి అంతం పలకాలి. ఇలాంటి మత విద్వేషాలను రెచ్చగొట్టే సమూహాలకు వ్యతిరేకంగా ఓ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని 2015లోనే నేను పార్లమెంటులో కోరాను. ఎందుకంటే ఈ విద్వేషమే మహాత్మా గాంధీని చంపేసింది. ఇద్దరు ప్రధాన మంత్రులు సహా ఎంతో మందిని చంపేసింది. మరి ఇలాంటి విద్వేష గ్రూపులపై ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? - అసదుద్దీన్ ఓవైసీ, ఏఐఎమ్ఐఎమ్ అధినేత
ఏం జరిగింది?
ఉత్తరప్రదేశ్‌లో అసదుద్దీన్ ఓవైసీ కారుపై కాల్పుల ఘటన నేపథ్యంలో ఆయనకు 'Z' కేటగిరీ భద్రత కల్పిస్తూ శుక్రవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. Z కేటగిరీ కింద 22 మంది భద్రతా సిబ్బందితోపాటు ఒక ఎస్కార్ట్ వాహనాన్ని కేటాయించనుంది. వీరిలో నలుగురు నుంచి ఆరుగురు ఎన్‌ఎస్‌జీ కమాండోలు, పోలీసు సిబ్బంది కూడా ఉంటారు. అయితే కేంద్ర నిర్ణయాన్ని అసదుద్దీన్ తిరస్కరించారు.
అసదుద్దీన్ ఓవైసీపై గురువారం ఉత్తరప్రదేశ్‌లో హత్యాయత్నం జరిగింది. పశ్చిమ యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రచారంలో పాల్గొని, గురువారం దిల్లీకి తిరిగివస్తుండగా హపూర్-ఘజియాబాద్ మార్గంలో ఛిజార్సీ టోల్‌ప్లాజా సమీపంలో ఓవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. సాయంత్రం 6 గంటలకు ఈ సంఘటన జరిగినట్లు ఓవైసీ స్వయంగా వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు.
Also Read: UP Election 2022: రాజకీయాల్లోకి 'పుష్ప' ఫీవర్.. 'శ్రీవల్లి' పాటను రీమేక్ చేసిన కాంగ్రెస్