IT raids on DSR Real Estate :  హైదరాబాద్‌లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ డీఎస్‌ఆర్ గ్రూప్,  మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి సంబంధించిన నివాసాలు ,  కార్యాలయాలపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు  సోదాలు నిర్వహిస్తున్నారు.  ఈ సోదాలు హైదరాబాద్,  బెంగళూరులోని 30 ప్రదేశాలలో ఏకకాలంలో జరిగుతున్నాయి.  ఇవి పన్ను ఎగవేత,  రియల్ ఎస్టేట్ లావాదేవీలలో నగదు లావాదేవీలలో అవకతవకల కారణంగా జరుగుతున్నాయి. 
 
జూబ్లీ హిల్స్ లోని డీఎస్‌ఆర్ గ్రూప్ ప్రధాన కార్యాలయం , బంజారా హిల్స్, ఎస్‌ఆర్ నగర్, సురారం , ఇతర ప్రధాన ప్రాంతాలలో సోదాలు జరుగుతున్నాయి.  బెంగళూరులోని డీఎస్‌ఆర్ గ్రూప్‌కు సంబంధించిన కొన్ని కార్యాలయాలు,  ప్రాజెక్ట్ సైట్‌లలో సోదాలు నిర్వహించారు.  డీఎస్‌ఆర్ గ్రూప్  రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులలో నగదు లావాదేవీల ద్వారా పన్ను ఎగవేత జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. డీఎస్‌ఆర్ స్కైఒన్, డీఎస్‌ఆర్ వరల్డ్ వంటి ప్రాజెక్టులలో ఫ్లాట్లు రూ. 12,000–13,000 చదరపు అడుగుకు విక్రయించినట్లు  ఆధారాలు ఉన్నాయి.  అయితే రిజిస్ట్రేషన్ విలువలలో గణనీయమైన తేడాలు ఉండటంతో ఐటీ అధికారులు సోదాలు ప్రారంభించారు. గత ఐదు సంవత్సరాలలో పన్ను చెల్లింపులలో అవకతవకలను గుర్తించడానికి అధికారులు ఆర్థిక రికార్డులను పరిశీలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసుతో సంబంధం ఉన్న శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ కంపెనీతో డీఎస్‌ఆర్ గ్రూప్ లావాదేవీలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

Continues below advertisement


డీఎస్‌ఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, డీఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్, డీఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్, డీఎస్‌ఆర్ ప్రైమ్ స్పేసెస్, మరియు డీఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌లో సోదాలు జరుగుతున్నాయి. మాజీ చేవెళ్ల  రంజిత్ రెడ్డి  డీఎస్‌ఆర్ గ్రూప్‌లో భాగస్వామిగా ఉన్నారని, డీఎస్‌ఆర్ ప్రైమ్ స్పేసెస్ ,  ఇతర డీఎస్‌ఆర్ సంస్థలతో ఆర్థిక లావాదేవీలు కలిగి ఉన్నారని సమాచారం.   అధికారులు డీఎస్‌ఆర్ గ్రూప్ ,  రంజిత్ రెడ్డికి సంబంధించిన పత్రాలు, అకౌంట్ బుక్స్,  కొన్ని ఎలక్ట్రానిక్ డివైస్‌లను స్వాధీనం చేసుకున్నారు.  రియల్ ఎస్టేట్ లావాదేవీలలో దాచిన ఆదాయం ,  ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలలో అవకతవకలను గుర్తించడంపై ఐటీ అధికారులు దృష్టి సారించారు.  



రంజిత్ రెడ్డి 2019లో భారత రాష్ట్ర సమితి (BRS) టికెట్‌పై చేవెళ్ల నుండి లోక్‌సభ ఎంపీగా గెలిచారు. 2024 ఎన్నికల ముందు BRSని వీడి కాంగ్రెస్‌లో చేరారు, కానీ ఎన్నికలలో ఓడిపోయారు. 2024 ఎన్నికల అఫిడవిట్‌లో రంజిత్ రెడ్డి రూ. 435 కోట్ల ఆస్తులు డిక్లేర్ చేశారు, ఇది ఆయనను భారతదేశంలోని అత్యంత ధనవంతులైన మాజీ ఎంపీలలో ఒకరిగా చేసింది  డీఎస్‌ఆర్ గ్రూప్ ను 1988లో స్థాపించారు.  లగ్జరీ హౌసింగ్, విల్లాస్, గేటెడ్ కమ్యూనిటీలు,   కార్పొరేట్ కార్యాలయాలను నిర్మిస్తుంది  సోదాలు ఆగస్టు 19, 2025న ఉదయం నుండి కొనసాగుతున్నాయి. మరో రెండు రోజుల పాటు  సోదాలు జరిగే అవకాశాలు ఉన్నట్లుగా భావిస్తున్నారు.