irrigation projects in Telangana 2022 : తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తోంది. అత్యంత ప్రాధాన్య రంగంగా తీసుకుని నిధుల కేటాయింపు చేసి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేస్తోంది. ఈ ఏడాది కూడా ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరిగాయి. అయితే చివరికి వచ్చే సరికి నిధుల సమస్య రావడంతో ఇప్పుడు పనులు మందగించాయి.
మల్లన్న సాగర్ ప్రారంభం
కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి మల్లన్న సాగర్ ఈ ఏడాదే ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఎత్తైన రిజర్వాయర్ మల్లన్న సాగర్. రాష్ట్రంలోని ఎస్సారెస్పీ తర్వాత అతిపెద్ద రిజర్వాయర్ ఇది. సిద్దిపేట జిల్లా తొగుట,కొండపాక మండలం సరిహద్దులో దీనిని నిర్మించారు. 8 గ్రామాలతో పాటు మొత్తం 14 శివారు గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురయ్యాయి. దీని సామర్థ్యం 50 టీఎంసీలు. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ నుంచి సొరంగం ద్వారా తుక్కాపూర్ పంప్ హౌస్ కు చేరిన గోదావరి జలాలను మల్లన్న సాగర్ లోకి ఎత్తిపోస్తారు. ఈ రిజర్వాయర్ తో మొత్తంగా ఉమ్మడి మెదక్ తో పాటు ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లోని దాదాపు 11.29 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది.
సీతమ్మ సాగర్ పనుల్లో పురోగతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించనున్న సీతమ్మసాగర్ బహుళార్ధక ప్రాజెక్టును 15 నెలల్లోనే పూర్తిచేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలోనే ఈ ప్రాజెక్టును కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సంకల్పించింది. దుమ్ముగూడెం ఆనకట్ట ప్రాంతంలోనే సీతామరామ ప్రాజెక్టుకు నీరందించడానికి.. 320 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తికి అనుగుణంగా ఉండేందుకు 40 టీఎంసీల సామర్థ్య్యంతో సీతమ్మ సాగర్ బ్యారేజీని ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇది చివరి దశకు వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు త్వరలోనే సంపూర్ణంగా పూర్తవుతుంది. సమ్మక్క బ్యారేజీ పనులను ఈ ఎండాకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నారు.
వేగంగా నిర్మితమవుతున్న అన్ని ప్రాజెక్టులు
పక్కా ప్రణాళిక, ఆధునిక సాంకేతికతను వినియోగించుకొని దేశంలో ఏ రాష్ట్రం నిర్మించనంత వేగంగా తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులను గడువులోగా పూర్తిచేస్తున్నది. సాగునీటి రంగంలోనూ లైడార్ సర్వే విధానాన్ని ప్రవేశపెట్టి, తొలిసారి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి వినియోగించింది. శాటిలైట్ మ్యాప్‌ల ద్వారానే కచ్చితమైన అంచనాలతో ప్రాజెక్టుల డిజైన్‌ను రూపొందిస్తున్నది. ప్రాజెక్టుల నిర్మాణంలో ముఖ్యమైన ఫౌండేషన్ నిర్మాణాన్ని తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో చేసేందుకు అధునాతన టెక్నాలజీ కటాఫ్ టెక్నిక్‌ను వినియోగిస్తున్నది. పిల్లర్ల నిర్మాణంలో 5 మీటర్ల ఫ్రేమ్‌వర్క్ టెక్నాలజీకి బదులు 10 మీటర్ల ఫ్రేమ్ వర్క్‌ను వినియోగిస్తున్నారు.
ప్రాజెక్టు రికార్డుల డిజిటలైజ్
ప్రతీ ప్రాజెక్టుకు సంబంధించి డిజైన్, కాలువ నిర్మాణం తదితర అన్నింటితో కలిపి డిటైల్డ్ రిపోర్ట్‌లు, భారీ, అంతర్రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించి అయితే వివిధ రాష్ర్టాలతో చేసుకున్న ఒప్పంద ప్రతాలు, ట్రిబ్యునల్స్ నీటి కేటాయింపులు, ముఖ్యమైన జీవోలు తదితర కీలక పత్రాలు ఉంటాయి. ఇలా లక్షల్లో ఉన్న పత్రాలను వెతకడం, భద్రపరచడం అతిపెద్ద సవాల్. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కారు సాగునీటి శాఖకు సంబంధించిన డాక్యుమెంట్లనన్నింటినీ డిజిటలైజ్ చేయించింది. సుమారు 5 లక్షల డాక్యుమెంట్లను, 2 వేల బ్లూప్రింట్లను డిజిటలైజ్ చేయించింది. ఏ పత్రమైనా ఒక్క క్లిక్‌తో అందుబాటులోకి వచ్చే వ్యవస్థను ఏర్పాటు చేసింది. టెరిటోరియల్ వారీగా స్థిర, చర ఆస్తుల లెక్కల జాబితాను, ఆయకట్టు లెక్కల డాటాబేస్‌ను సిద్ధం చేయడం విశేషం. ఇరిగేషన్ పరిపాలన విభాగానికి సంబంధించిన అన్నీ ఆన్‌లైన్ ద్వారానే కొనసాగుతున్నాయి. ఉ
ఇరిగేషన్ విభాగంలో విప్లవాత్మక మార్పులు
ఇరిగేషన్ విభాగాన్ని మొత్తం 19 టెరిటోరియల్స్‌గా విభజించి, ప్రాజెక్టుల బాధ్యతలను చీఫ్ ఇంజినీర్లకు అప్పగించారు. ప్రాజెక్టులు, పంప్‌లు, కాల్వలు, తూముల నిర్వహణ బాధ్యతల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో కొత్తగా ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ విభాగాన్ని నెలకొల్పారు. ఒక ఇంజినీర్ ఇన్ చీఫ్ పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ విభాగానికి 879 పోస్టులను మంజూరు చేశారు. వీటికి తోడు 3 వేలకుపైగా లష్కర్ పోస్టులను కూడా మంజూరు చేశారు. డీఈల నుంచి సీఈల వరకు ఆర్థిక అధికారాలను కట్టబెట్టారు. ఫలితంగా కాలువలు, ప్రాజెక్టుల మరమ్మతు పనులు ఎప్పటికప్పుడు కిందిస్థాయిలోనూ పూర్తవుతున్నాయి.
వరదలతో కాళేశ్వరం మునక !
అయితే ఈ ఏడాది సాగునీటి రంగంలో అతిపెద్ద నష్టం కాళేశ్వరం మునక ద్వారా జరిగింది. భారీ వరదలకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని లక్ష్మి(మేడిగడ్డ), సరస్వతి (అన్నారం) పంప్‌హౌ్‌సలు మునిగిన విషయం విదితమే. అంతేకాకుండా అన్నారం నుంచి మేడిగడ్డకు వెళ్లే విద్యుత్తు సరఫరా వ్యవస్థ కూడా కుప్పకూలింది. ఇటు ప్రభుత్వానికి, అటు ట్రాన్స్‌కోకు తీవ్ర నష్టం వాటిల్లింది. అయితే యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించారు. మరోసారి ఎంతటి స్థాయి వరదలు వచ్చినా మునగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.