Indra Sena Reddy Nallu as Governor of Tripura:


ఢిల్లీ: రెండు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించారు. త్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనారెడ్డి, ఒడిశా గవర్నర్‌గా రఘుబర్‌ దాస్‌ లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. నల్లు ఇంద్రసేనారెడ్డి తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత, రఘుబర్‌ దాస్‌ ఝార్ఖండ్‌ మాజీ సీఎం అని తెలిసిందే. 


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర అధ్యక్షుడిగా నల్లు ఇంద్రసేనారెడ్డి సేవలు అందించారు. ఆయన స్వస్థలం తెలంగాణలోని సూర్యాపేట జిల్లా. మలక్‌పేట నుంచి గతంలో మూడు సార్లు బీజేపీ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన సేవలు గుర్తించిన పార్టీ అధిష్టానం ఉమ్మడి ఏపీ అధ్యక్షుడిగానూ బాధ్యతలు అప్పగించింది. 2022లో బీజేపీ చేరికలు, సమన్వయ కమిటీ ఛైర్మన్‌గా  ఇంద్రాసేనారెడ్డి నియమితులయ్యారు. ఒడిశా గవర్నర్ గా నియమితులైన రఘుబర్‌దాస్‌ 2014 నుంచి 2019 వరకు ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. జాతీయ స్థాయిలో పార్టీకి ఉపాధ్యక్షుడిగా చేసిన అనుభవం ఆయన సొంతం.


ఇంద్రసేనారెడ్డి సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గానుగబండ గ్రామంలో నల్లు రాంరెడ్డి, హనుమాయమ్మ దంపతులకు జన్మించారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి 1972లో ఎం.ఎస్.సి పూర్తి చేసి, వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ నుంచి 1975లో ఎం.ఫీల్ పూర్తి చేశారు. 


విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే రాజకీయాల పట్ల ఆసక్తి కలిగింది. దాంతో 1980లో భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు ఇంద్రాసేనా రెడ్డి. ఆయన 1983, 1985, 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మలక్‌పేట్ నియోజకవర్గం నుండి మూడుసార్లు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1996, 2004లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ లోకసభ నియోజకవర్గం నుంచి, 2009లో మల్కాజ్‌గిరి లోకసభ నుంచి, 2014లో భువనగిరి లోకసభ స్థానానికి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిచెందారు. ఈ క్రమంలో ఆయన బీజేపీలో జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేశారు.