కరోనా వ్యాక్సిన్ల పంపిణీలో భారత్ రికార్డ్ సృష్టించింది. భారత్ 100 కోట్ల కోవిడ్ టీకాల మైలురాయిని చేరుకుంది. దీనికి గుర్తుగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దేశంలోని 100 పురాతన కట్టడాలను జాతీయ పతాక రంగుల్లో ప్రకాశించేలా ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ చార్మినార్ ను విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు.
లేపాక్షి ఆలయంలో ప్రత్యేక పూజలు
అనంతపురం జిల్లా హిందూపురంలో వంద కోట్ల వ్యాక్సిన్స్ పూర్తి చేసిన సందర్భంగా లేపాక్షి ఆలయంలో ఐదు రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్కియాలజీ అధికారులు ఈ ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయంలో దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలను మహమ్మారి నుంచి కాపాడాలని కోరుకుంటూ మొక్కులు తీర్చుకున్నారు. గురువారం చివరి రోజు కావడంతో అమ్మ వారికి ప్రత్యేక అలంకరణ, అభిషేకాలు. అర్చనలు నిర్వహించారు. ఆలయానికి త్రివర్ణ పతాక రంగులతో ప్రత్యేక విద్యుత్ దీపాల అలంకరణ చేసి శోభాయమానంగా తీర్చదిద్దారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు.
Also Read: చిన్నారులకు కరోనా టీకాలపై కొవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్ కీలక వ్యాఖ్యలు
100 కోట్ల మైలురాయి
భారత్ చేపట్టిన టీకా డోసుల కార్యక్రమం వంద కోట్లకు దాటింది. నేడు భారత్ ఈ కీలక ఘట్టానికి చేరుకుంది. చైనా తర్వాత వంద కోట్ల డోసులు అందించిన రెండో దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. ఇవాళ్టి ఉదయ నాటికి మనదేశంలో 100 కోట్ల డోస్‌ల టీకాలు వేశారు. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటన చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ విజన్‌తోనే ఈ విజయం సాధ్యమయిందని మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ఈ ఏడాది జనవరి 16న టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. తొలి దశలో భాగంగా కరోనా పోరులో ముందున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులకు టీకాలు ఇచ్చారు. ఆ తర్వాత ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి.. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ వ్యాక్సిన్ వేయడం ప్రారంభమైంది.
Also Read: 'ఇక తగ్గేదేలే.. నవ చరిత్రను లిఖించాం.. 100 కోట్ల మార్క్‌పై మోదీ ప్రశంసలు'
ప్రత్యేక గీతం
వ్యాక్సినేషన్‌లో 100 కోట్ల ఘనత సాధించిన సందర్భంగా ఓ ప్రత్యేక గీతాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ విడుదల చేశారు. దేశంలో కరోనా టీకా పంపిణీ శత కోటి డోసుల మార్క్ దాటడంపై శుభాకాంక్షలు తెలిపారు. దిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు హాజరయ్యారు.
Also Read: '100 కోట్ల టీకా' ఘనత గీతం విన్నారా? అదిరిపోయింది కదా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి