Kavitha Phones : ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ హాట్ టాపిక్‌గా మారింది. మూడో సారి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యే సందర్భంలో ఈడీ అధికారులు తాను ధ్వంసం చేసినట్లుగా ప్రచారం చేసిన పది ఫోన్లను రెండు కవర్లలో మీడియాకు చూపించారు. వాటిని ధ్వంసం చేయలేదని.. తన ప్రైవేసీకి భంగమే అయినా ఈడీకీ ఫోన్లు సమర్పిస్తున్నానని ప్రకటించారు. అయితే ఇలా ఫోన్లను ప్రదర్శించగానే బీజేపీ నేతలు రంగంలోకి దిగిపోయారు. వీడియోలను ఫోటోలను జూమ్ చేసుకుని వాటి ఐఎంఈఐ నెంబర్లను చెక్ చేసి.. వివరాలు పోస్ట్ చేసి కొత్త ఆరోపణలు చేస్తున్నరు.
కవిత మీడియాకు ప్రదర్శించిన ఓ ఫోన్ ఐఎంఈఐను బీజేపీ నేతలు, కార్యకర్తలు ఫోటోలను జూమ్ చేయడం ద్వారా సేకరించారు. ఓ ఫోన్ ఐ ఫోన్ ప్రో ఐఎంఈఐ నెంబర్ అని గుర్తించారు. అసలు ఈ ఫోన్ లాంచ్ అయింది గత ఏడాది సెప్టెంబర్‌లో అని.. కొన్నది అక్టోబర్‌లో అని.. ఈ ఫోన్ ను ఎవిడెన్స్ గా ఎలా ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అసలు లిక్కర్ పాలసీని ఆరోపణలు వచ్చిన తర్వాత జూలైలోనే ఢిల్లీ ప్రభుత్వం స్క్రాప్ చేసిందని .. ఆ తర్వాత కొన్న ఫోన్లను ఈడీకి సాక్ష్యాలుగా ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.
మరో వైపు లిక్కర్ స్కాంపై ఎగ్రెసివ్‌గా స్పందిస్తున్న తెలుగు రాష్ట్రాల బీజేపీ నేత, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నెహ్రూ యువ కేంద్ర వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఈ అంశంపై స్పందించారు. కవిత ఎవరిని ఫూల్ చేయాలనుకుంటున్నారని సోషల్ మీడియాలో ప్రశ్నించారు.
మరో వైపు జాతీయ స్థాయిలో బీజేపీ నేతలు.. సోషల్ మీడియా కార్యకర్తలు కూడా అసలు కవిత స్వల్ప కాలంలో అన్ని ఫోన్లను మార్చడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈడీకి తను ధ్వంసం చేశారని ప్రచారం చేసిన ఫోన్లన్నింటినీ కవిత అంద చేశారు. వాటిపై ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.