WillFul Loan Defaulters: పారిశ్రామిక రంగం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతోంది. కేంద్ర బడ్జెట్‌ రూపంలో ఏటా లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తోంది. పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలకు బ్యాంకు రుణాల రూపంలో ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. తద్వారా, వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఆయా కంపెనీలు, వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వం & బ్యాంకులు సాయపడుతున్నాయి. 


అయితే, వ్యాపార వృద్ధి కోసం బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న కొందరు, ఆ రుణాలను తిరిగి చెల్లించడంలో కాలయాపన చేస్తుంటారు. ఉద్దేశపూర్వకంగానే రుణాలను ఎగ్గొడుతుంటారు. అలాంటి వారిని విల్‌ఫుల్ డిఫాల్టర్స్ (Willful defaulters) లేదా ఉద్దేశపూర్వక ఎగవేతదార్లుగా పిలిస్తారు.


ఒక జాతీయ మీడియా సంస్థ లెక్క ప్రకారం... ఈ ఏడాది, ఉద్దేశపూర్వక ఎగవేతదార్లు దేశంలోని కొన్ని పెద్ద బ్యాంకులను రూ. 88,435 కోట్ల మేర మోసగించినట్లు తెలిసింది. గత ఏడాది ఈ మొత్తం రూ. 75,294 కోట్లుగా ఉంది. ఎగవేత మొత్తమే కాదు, ఈ ఏడాది ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల సంఖ్య కూడా పెరిగింది.


కోట్లలో మోసపోయాయిన బ్యాంకులు
నేషనల్‌ మీడియా రిపోర్ట్‌ ప్రకారం... ఉద్దేశపూర్వక ఎగవేతదార్లు దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన కొన్ని బ్యాంకులను మోసం చేశారు. బాధిత బ్యాంకుల లిస్ట్‌లో.... పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank), బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda), ఐడీబీఐ బ్యాంక్ (IDBI Bank) సహా మరికొన్ని బ్యాంకులు ఉన్నాయి.


రుణ మొత్తం లేదా నెలవారీ వాయిదాలు (EMI) చెల్లించగలిగే స్థితిలో ఉనప్పటికీ చెల్లించని వ్యక్తులే విల్‌ఫుల్ డిఫాల్టర్లు. ఏరు దాటే వరకు పడవ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అనే టైపు వీళ్లు. అప్పు తీసుకునే సమయంలో ఉన్న శ్రద్ధ, తిరిగి తీర్చడంలో ఉండదు. 


TransUnion CIBIL డేటా ప్రకారం, 2022 డిసెంబర్ వరకు, ఈ ఉద్దేశపూర్వక ఎగవేతదార్లకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు ఉన్న బకాయిలు రూ. 38,712 కోట్లు. బ్యాంక్ ఆఫ్ బరోడాకు 2023 జనవరి వరకు రావల్సిన మొత్తం రూ. 38,009 కోట్లు.  గత ఏడాది ఈ మొత్తం రూ. 24,404 కోట్లు కాగా, ఈ ఏడాది రూ. 38,000 కోట్లు దాటింది. దేశంలో అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్‌ అయిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ రావలసిన బకాయిలు రూ. 11,714 కోట్లు. గత ఏడాది మార్చి వరకు ఈ సంఖ్య రూ. 9,007 కోట్లు. IDBI బ్యాంక్‌ వద్ద 2023 ఫిబ్రవరి వరకు ఉన్న రుణ బకాయిల మొత్తం రూ. 26,400 కోట్లు.


దేశంలో టాప్‌-3 విల్‌ఫుల్‌ డిఫాల్టర్స్‌
ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల గురించిన సమాచారాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ పార్లమెంటులో వెల్లడించారు. గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ (Gitanjali Gems Limited) దేశంలోనే అతి పెద్ద విల్‌ఫుల్ డిఫాల్టర్ కంపెనీ అని తెలిపారు. ఈ కంపెనీ రూ. 7,848 కోట్ల రుణాన్ని కట్టకుండా ఎగ్గొట్టింది. ఎరా ఇన్‌ఫ్రా (Era Infra) ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఈ కంపెనీ బ్యాంకులకు రూ. 5,879 కోట్ల బకాయి పడింది. లిస్ట్‌లో మూడో పేరు రేయ్‌ ఆగ్రో Rei Agro). ఈ కంపెనీ చెల్లించాల్సిన మొత్తం బకాయిలు రూ. 4,803 కోట్లు.