Sehwag - Rishabh Pant:  భారత క్రికెట్ జట్టు తరఫున టెస్టులలో రెండు ట్రిపుల్ సెంచరీలు చేసిన వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ గురించి  ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.  క్రీజులోకి దిగితే బాదుడే మంత్రంగా  బౌండరీల మోత మోగించే వీరూ.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  ప్రస్తుతం టీమిండియాలో ఉన్న ఆటగాళ్లలో ఒక్కరు కూడా తనలా బ్యాటింగ్ చేయలేరని  చెప్పుకొచ్చాడు.  కొంతమంది రిషభ్ పంత్‌ను తనతో పోల్చుతారని, కానీ తాను  డబుల్ సెంచరీల మీద దృష్టి పెడితే  పంత్ మాత్రం  90 లలోనే ఆగిపోతాడని చెప్పాడు. 


ఓ జాతీయ న్యూస్ ఛానెల్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో వీరూ మాట్లాడుతూ... ‘టీమిండియాలో నా మాదిరిగా బ్యాటింగ్ చేసే బ్యాటర్ ఉన్నాడని నేను అనుకోను.  కొంతలో కొంత  రిషభ్ పంత్, పృథ్వీ షా ల బ్యాటింగ్ నా బ్యాటింగ్ శైలిని పోలి ఉంటుంది.  ఈ ఇద్దర్లో పంత్  కాస్త దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తాడు. కానీ  టెస్టు క్రికెట్ లో పంత్.. 90-100 పరుగుల వద్దే ఆగిపోతాడు. కానీ నేను మాత్రం 200, 250, 300 చేయాలనే మైండ్ సెట్ తో ఉంటా.  పంత్ కూడా నాలా ఆలోచిస్తే అప్పుడు  అతడు  నాకంటే ఫ్యాన్స్ ను ఎక్కువ ఎంటర్‌టైన్ చేయగలడు..’అని  చెప్పాడు. 


బాదుడే నా మంత్రం.. 


తాను క్రికెట్ ఆడిన కొత్తలో టెన్నిస్ బాల్ తో ఆడేవాడినని, దాంతో  దొరికిన బంతిని దొరికినట్టుగా బౌండరీ దాటించేవాడనని చెప్పిన వీరూ.. అదే ఫార్ములాను ఇంటర్నేషనల్ క్రికెట్ లో కూడా వాడానని చెప్పుకొచ్చాడు. ‘నేను టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడేప్పుడు   సింగిల్స్, డబుల్స్ కంటే ఎక్కువగా బౌండరీల మీదే దృష్టి సారించేవాడిని.   అదే ఫార్ములాను ఇంటర్నేషనల్ క్రికెట్ లో కూడా వాడాను.  ఎన్ని బౌండరీలు కొడితే సెంచరీ చేరొచ్చో ముందే  లెక్కలు వేసుకునేవాడిని...


ఒకవేళ నేను   90 రన్స్ వద్ద ఉన్నప్పుడు  సెంచరీ చేరుకోవడానికి పది సింగిల్స్ తీయాలంటే పది బంతులను  ఆడాలి. కానీ  ఓ సిక్సర్, ఫోర్ కొడితే  రెండు బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకోవచ్చు కదా. నేను ఆ మైండ్ సెట్ తోనే ఉండేవాన్ని. ద  దాంతో రిస్క్  పర్సంటేజీ కూడా   200 నుంచి వంద శాతానికి  పడిపోయేది..’అని  తెలిపాడు. 


ముల్తాన్‌లో సచిన్ కొడతా అన్నాడు.. 


పాకిస్తాన్ పర్యటనలో భాగంగా  ముల్తాన్ టెస్టులో  వీరూ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. అయితే ఈ టెస్టులో ట్రిపుల్ సెంచరీ ముందు తాను సిక్సర్ కొడతానని అంటే అవతలి ఎండ్ లో ఉన్న సచిన్ టెండూల్కర్ తనను వారించాడని.. ‘నీకేమైనా పిచ్చా..?  ఇంతవరకూ ఏ ఒక్క ఇండియన్ బ్యాటర్ కూడా ట్రిపుల్ సెంచరీ చేయలేదు. ఆ అవకాశాన్ని పాడు చేసుకోకు.  నువ్వు సిక్సర్ కొడితే నా బ్యాట్ తో కొడతా’అని చెప్పాడని, కానీ తాను మాత్రం  సక్లయిన్ ముస్తాక్ బౌలింగ్ లో 294 వద్ద ఉండగా సిక్సర్ బాది  ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశానని వీరూ తెలిపాడు. తాను ట్రిపుల్ సెంచరీ చేసినందుకు తనకంటే ఎక్కువ సచినే  సంతోషించాడని  వీరూ వివరించాడు.