Asia Cup 2023: సుమారు ఆరు నెలల కాలంగా చర్చనీయాంశమైన ఆసియా కప్ - 2023 నిర్వహణ వివాదం  గురించి తాజాగా  పాకిస్తాన్  క్రికెట్ జట్టు మాజీ సారథి షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశాడు.  రెండు దేశాల మధ్య సంబంధాలు బాగుపడాలంటే క్రికెట్ ఒక్కటే మార్గమని.. ఈ విషయంలో తాను త్వరలోనే  భారత ప్రధాని నరేంద్రమోడీని అభ్యర్థిస్తానని  అన్నాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్‌సీ)   లో ట్రోఫీ గెలిచిన అనంతరం అఫ్రిది ఈ కామెంట్స్ చేశాడు.  


మాట్లాడుకుంటేనే  పరిష్కారం.. 


ఎల్ఎల్‌సీ గెలిచిన తర్వాత అఫ్రిది ఆసియా కప్ నిర్వహణపై  మాట్లాడుతూ..‘భారత్ - పాక్ ల మధ్య  ద్వైపాక్షిక సిరీస్ లు,  ఇతర టోర్నీలు జరగాలి.  ఈ మేరకు నేను ఆసియా కప్ ఆడేందుకు భారత జట్టును పాకిస్తాన్ కు పంపాలని త్వరలోనే భారత  ప్రధాని  నరేంద్ర మోడీని   కోరతాను’అని చెప్పాడు.    ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఇంతవరకూ ద్వైపాక్షిక సిరీస్ ల గురించి చర్చించుకోలేదని, చర్చించుకుంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని  అఫ్రిది చెప్పాడు.  ‘అసలు వాస్తవం ఏంటంటే ఇంతవరకూ అటు బీసీసీఐ గానీ ఇటు పీసీబీ గానీ  తమ సమస్యల గురించి చర్చించుకోలేదు. కూర్చుని పరిష్కరించుకుంటే తప్ప  సమస్యలకు సమాధానం దొరకదు.  ఇరు బోర్డుల మధ్య కమ్యూనికేషన్ చాలా ప్రధానం...’అని  అఫ్రిది అన్నాడు. 


నాకు ఇండియా టీమ్ లో ఫ్రెండ్స్ ఉన్నారు.. 


ఇరు దేశాల మధ్య క్రికెట్ సిరీస్ లు జరిగితేనే   రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతాయని అఫ్రిది అన్నాడు. ‘నాకు ఇప్పటికీ ఇండియా టీమ్ లో ఫ్రెండ్స్ ఉన్నారు. ఎల్ఎల్‌సీలో భాగంగా ఇండియా టీమ్ తో మ్యాచ్ ఆడినప్పుడు  నేను సురేశ్ రైనా దగ్గరికి వెళ్లి బ్యాట్ అడిగా. నేను అడగ్గానే  రైనా బ్యాట్ ఇచ్చాడు’ అని తెలిపాడు.  


భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి  జట్లు కూడా పాకిస్తాన్ కు  వచ్చి క్రికెట్ ఆడుతున్నాయని తెలిపాడు.  భారత్ భద్రతా సమస్యల గురించి ఆందోళన చెందితే  తాము కూడా భారత్ కు వచ్చినప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయని  అఫ్రిది తెలిపాడు. మరి  అఫ్రిది కామెంట్స్ పై కేంద్ర ప్రభుత్వం,  బీసీసీఐ ఎలా స్పందిస్తాయో చూడాలి. 


ఏంటీ వివాదం..?  


ఈ వివాదానికి  2022 ప్రపంచకప్ సమయంలో బీజం పడింది. బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న  జై షా..  2023లో పాకిస్తాన్ లో జరగాల్సి ఉన్న  ఆసియా కప్ కోసం టీమిండియా ఆ దేశం వెళ్లదని, తటస్థ వేదిక అయితే తాము ఆడతామని  కామెంట్స్ చేశాడు. ఇది పాకిస్తాన్ క్రికెట్  ను ఇప్పటికీ కుదిపేస్తున్నది.   జై షా కామెంట్స్ కు బదులుగా  నాటి పీసీబీ చీఫ్ రమీజ్ రాజాతో పాటు  ప్రస్తుత అధ్యక్షుడు నజమ్ సేథీ కూడా  ఈ విషయంలో  కాస్త ఘాటుగానే  స్పందిస్తున్నారు. భారత్ ఆసియా కప్ ఆడేందుకు పాకిస్తాన్‌కు రాకుంటే.. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ (భారత్ లో జరుగనుంది)  కోసం తాము కూడా ఇండియాకు రాబోమని  హెచ్చరిస్తున్నారు. దీనిపై ఇదివరకే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) లో కూడా పలుమార్లు చర్చలు జరిగాయి.  పీసీబీ చివరి ప్రయత్నంగా ఐసీసీ వద్ద ఈ  సమస్యకు పరిష్కారం తేల్చుకోవాలని భావిస్తున్నది.   ఈనెల చివర్లో  దుబాయ్ లో ఐసీసీ  బోర్డు సభ్యుల సమావేశంలో  ఈ అంశాన్ని లేవనెత్తాలని పీసీబీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.