తెలుగు రాష్ట్రాల్లో చలి విపరీతంగా పెడుతోంది. సాయంత్రమైతే చాలు.. వణికిస్తోంది. మరోవైపు భాగ్యనగరంలోనూ చలి ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. తెలంగాణలోని ఆదిలాబాద్ లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో విశాఖ మన్యంలోనూ చలి విపరీతంగా పెడుతుంది.
హైదరాబాద్ లో సాయంత్రమైతే.. ఇక దుప్పటి కప్పుకుని బయటకు వెళ్లాలా అనే రేంజ్ లో చలి ఉంది. శివారు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. సాధారణం కంటే మూడు, నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. ఒక్కోసారి ఆదిలాబాద్ తో పోల్చుకుంటే.. హైదరాబాద్‌లోనే రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో శనివారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పటాన్‌చెరు 8.4 డిగ్రీలు, రాజేంద్రనగర్ 9 డిగ్రీలు, హయత్ నగర్ 10 డిగ్రీలు, ఆదిలాబాద్ 10.6, మెదక్ 10.8, హనుమకొండ 13, హకీంపేట 13.5, రామగుండం 13.4, నిజామాబాద్ 14.1, నల్లొండ 15, భద్రాచలం 15.4, మహబూబ్‌నగర్ 17.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆదిలాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 10.4 డిగ్రీలు ఉంది. ఉత్తర, ఈశాన్య ప్రాంతాల నుంచి శీతల గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పొడి వాతావరణం ఏర్పడి.. చలి తీవ్రతం ఎక్కువగా ఉందని వెల్లడించింది. ఇంకా కొన్ని రోజులపాటు ఇలా ఉంటుందని పేర్కొంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
మరోవైపు ఏపీలోను పలు జిల్లాల్లో చలి విపరీతంగా పెరిగింది. విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు కనిష్టంగా పడిపోతున్నాయి. చింతపల్లిలో 5.8, పాడేరులో 8 డిగ్రీలు, మినుములూరులో 7 డిగ్రీలు, లంబసింగిలో 4.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మన్యంలో ఉదయం, సాయంత్రం వెళ్లాలంటే.. రహదారులన్నీ పొగమంచుతో కప్పుకుని ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్ని చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉదయం తొమ్మిదైనా పొగమంచు కమ్ముకునే ఉంటుంది. సాయంత్రం మూడున్నర ప్రాంతంలో చలి మెుదలవుతుంది. వచ్చే రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశామున్నట్టు వాతావరణ అధికారులు వెల్లడించారు.
Also Read: Telangana Letter To KRMB: కల్వకుర్తి కింద కొత్త ఆయకట్టును పెంచలేదు
Also Read: Kishan Reddy: నేను నాగలి కడతా.. నువ్వు కడతావా కేసీఆర్, ఆ పౌరుషం చూపాల్సిందే.. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు