సీఎం కేసీఆర్ లక్ష్యంగా కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి మరోసారి విమర్శలు చేశారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై విష ప్రచారం చేస్తున్నారని మరోసారి ఆరోపించారు. కేసీఆర్ ప్రెస్ మీట్ వినాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. తాను నాగలి కడతానని.. తనతో నాగలి కట్టేందుకు కేసీఆర్ సిద్ధమా? అని కిషన్ రెడ్డి సవాలు విసిరారు. వచ్చే రబీ గురించి దేశంలో ఏ రాష్ట్రానికీ కేంద్రం ధాన్యం అమ్మే విషయంలో టార్గెట్ ఇవ్వలేదని అన్నారు. అన్ని రాష్ట్రాలతోనే తెలంగాణకు టార్గెట్ ఇస్తామని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంపై పియూష్ గోయల్ స్పష్టత నిచ్చారని వెల్లడించారు. 20 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అదనంగా కొనుగోలు చేసేందుకు కేంద్రం అంగీకరించిందని వెల్లడించారు. టీఆర్ఎస్ నాయకులు ఢిల్లీ వెళ్లేందుకు పెట్టిన శ్రద్ధ రైతుల సమస్యల పరిష్కారానికి పెట్టాలని సూచించారు.


‘‘సమస్య అంతా బాయిల్డ్ రైస్‌తో వచ్చింది. తెలంగాణలో ఒక్క కుటుంబం కూడా బాయిల్డ్ రైస్ తినదు. అనవసరంగా రైతులను బయపెట్టకండి. పంట మార్పిడికి బీజేపీ.. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తుంది. గడిచిన ఏడేళ్లుగా కేసీఆర్ ధాన్యం తానే కొంటున్నానని అని చెప్పి.. ఇవ్వాళ మాత్రం కేంద్రమే కొంటుందని ధర్నా చేస్తున్నారని మండిపడ్డారు. పంటను కొనే బాధ్యత కేంద్రానిది మాత్రమే కాదని.. రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాల’’ని డిమాండ్ చేశారు.





 


తెలంగాణ ఏర్పడిన రోజు జీహెచ్ఎంసీలో మిగులు బడ్జెట్ ఉండేదని.. ఇప్పుడు అధికారులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని మండిపడ్డారు. కార్పొరేషన్ పేరుతో అప్పులు తెచ్చారని అన్నారు. ఉన్న వాటిని అభివృద్ధి చేయకుండా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం కావాలని అడుగుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని, 21 రోడ్లు ఎక్కడ బ్లాక్ చేశారో కేటీఆర్ చెప్పాలని ప్రశ్నించారు.






హిందూ దేవుళ్లను విమర్శిస్తారా?
ఓవైపు అసదుద్దీన్, మరో వైపు అక్బరుద్దీన్‌ను కూర్చోపెట్టుకుని కేసీఆర్ నీతులు చెప్పొద్దని కిషన్ రెడ్డి హితవు పలికారు. హిందు దేవుళ్లను విమర్శించిన వారిని పక్కనపెట్టుకుని బీజేపీని కేసీఆర్ విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హింసను, ఘర్షణను ప్రేరేపించేలా కేసీఆర్ మాట్లాడుతున్నారని అన్నారు. కుటుంబ పాలనపై తెలంగాణ బిడ్డలు పౌరుషాన్ని చూపించాల్సిన అవసముందని అన్నారు. 


తెలంగాణలో భారీగా రోడ్ల నిర్మాణం
తెలంగాణలో కేంద్రం తరఫున 274 కి.మీ. మేర రోడ్డు పనులు రూ.7,040 కోట్లతో జరుగుతున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. దీనిపై అధికారులతో పనులపై సమీక్షలు జరుపుతున్నానని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర సర్కారే భూసేకరణ పనులను ఆలస్యం చేస్తోందని అన్నారు. మరో 336 కి.మీ. మేర పనులు రూ.8,500 కోట్లతో చేపట్టేందుకు ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయని కేంద్రమత్రి తెలిపారు. 2022 లో టెండర్ కావాల్సిన 860 కి.మీ. పనులకే కేంద్రం ఖర్చు చేయబోతుందని అన్నారు. జాతీయ రహదారులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయబోతున్నామని తెలిపారు. ప్రధాని మోదీ వచ్చాకే నేషనల్ హైవేలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. 


అదేవిధంగా, రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉంటుందన్నారు. అనేక నూతన నగరాలు, కాలనీలు పెరగనున్నాయని అన్నారు. అనేక జిల్లాలు ఆర్ఆర్ఆర్‌కు అనుసంధానం అవుతాయని తెలిపారు. పరిశ్రమలు, ఐటీ డెవలప్‌మెంట్ అవుతున్నాయని అన్నారు. 







Also Read: Omicron Cases: తెలంగాణలో విస్తరిస్తోన్న ఒమిక్రాన్... కొత్తగా 12 కేసులు


Also Read: తెలంగాణ ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో పేలిన తుపాకులు... ఇద్దరు మావోయిస్టులు మృతి.. తప్పించుకున్న అగ్రనేతలు!


Also Read: ఫైజర్ ఒమిక్రాన్ పిల్ అత్యవసర వినియోగానికి ఈయూ అనుమతి... 90 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోన్న టాబ్లెట్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి