Allu Arjun Helping 25 Lakhs To Victim Family In Sandhya Theater Stampede: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో బుధవారం పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. బాలుని వైద్య ఖర్చులు పూర్తిగా భరిస్తామని.. ఆ కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ ఘటన తమను తీవ్రంగా కలిచివేసిందని.. బాధిత కుటుంబానికి పుష్ప టీమ్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.
ఇదీ జరిగింది
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌లో బుధవారం రాత్రి 9:40 గంటలకు పుష్ప - 2 ప్రీమియర్ షో నేపథ్యంలో అధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే సినిమా చూసేందుకు థియేటర్‌కు అల్లు అర్జున్ వచ్చారు. ఆయన్ను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు యత్నించగా జరిగిన తోపులాటలో రేవతి అనే మహిళతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిని జనం నుంచి బయటకు తీసుకొచ్చిన పోలీస్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే రేవతి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అటు, ఈ ఘటనపై అల్లు అర్జున్ సహా థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ మేనేజర్‌పై కేసు నమోదైంది. సెక్షన్ 105, 118 BNS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు డీసీపీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. కీలక నటులు థియేటర్‌కు వస్తారనే సమాచారం తమకు లేదని.. కనీసం థియేటర్ యాజమాన్యం కూడా తొలుత సమాచారం ఇవ్వలేదని చెప్పారు. దానికి తోడు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని.. క్రౌడ్ అదుపు చేసేందుకు థియేటర్ ఎంట్రీ, ఎగ్జిట్‌లో ఎలాంటి ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు, ఈ ఘటనపై పుష్ప 2 చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపింది.