IT Raids on Tollywood Producers : తెలుగు సినీ నిర్మాతలపై ఐటీ అధికారులు జరుపుతోన్న సోదాలు(IT Raids) రెండవ రోజు కొనసాగుతున్నాయి. జనవరి 21న ఉదయం నుంచి టాలీవుడ్ సినీ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, మైత్రీ మూవీస్ సంస్థ, ఆఫీసుల్లో ఈ దాడులు జరుగుతున్నాయి. అందులో భాగంగా రెండో రోజు బుధవారం నాడు సైతం పెద్ద సినిమాలకు ఫైనాన్స్ చేసిన ఫైనాన్సర్లను సైతం ఐటీ అధికారులు విచారిస్తున్నారు. మొత్తం 55 బృందాలుగా చేరి ఎనిమిది చోట్ల సోదాలు చేస్తున్నారు. ఈ దాడులు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కొండాపూర్ లో కొనసాగుతున్నాయి. ఇటీవల విడుదలై, బాక్సీఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను వసూలు చేసిన పుష్ప 2(Pushpa 2) విజయం తర్వాత ఈ దాడులు జరిగాయి.


మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)తో పాటు మ్యాంగో సంస్థల్లోనూ దాడులు 


హైదరాబాద్‌లోని ఉన్నత స్థాయి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాలలో ప్రారంభమైన ఈ దాడులు, దిల్ రాజు ఇల్లు, ఎస్వీసీ (SVC) బ్యానర్ తో పాటు మ్యాంగో (Mango Music) సంస్థ యజమాని యరపతినేని రామ్ ఇళ్లు, కార్యాలయం, వారి కుటుంబ సభ్యుల ఆస్తులతో సహా ఈ చిత్రనిర్మాతలతో సంబంధం ఉన్న ఎనిమిది ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నాయని దాడులు చేస్తున్నట్టు సమాచారం. దిల్ రాజు(Dil Raju) నివాసంతో పాటు ఆయన కూతురు హన్సిత, సోదరుడు శిరీష్ నివాసాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి నేపథ్యంలో వచ్చిన భారీ సినిమాల్లో పెట్టు బడులు, ఆదాయంపై నిర్మాతలను ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఆయా సంస్థల బాలెన్స్ షీట్స్(Balance Sheet) ను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 


దాడులకు కారణం ఇదేనా..


టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోన్న ఐటీ దాడులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పుష్ప 2: ది రూల్ ప్రీ రిలీజ్ వేడుకలో వందల కోట్ల బిజినెస్ చేసినట్లు ప్రకటించడమే ఐటీ అధికారుల సోదాలకు కారణమైనట్టు టాక్ వినిపిస్తోంది. భారీ కలెక్షన్స్ అంటూ ఆర్భాటాలకు పోయి పీక మీదకు తెచ్చుకున్నారా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా కలెక్షన్స్ ను అతిశయంగా చూపించడం, ఆ స్టంట్ ను ప్రచారంలోనూ వాడుకోవడం ఇప్పుడు తెలుగు నిర్మాతలకు తలనొప్పిగా మారింది. దీంతో లావాదేవీలలో పారదర్శకత లేకపోవడం, కలెక్షన్లపై పన్ను ఎగవేత కారణంగానే ఈ దాడులు జరుగుతోన్నట్టు తెలుస్తోంది. ఈ దాడులు రేపు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు సమాచారం.


మైత్రీ మూవీ మేకర్స్


నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి కలిసి 2015లో మైత్రీ మూవీ మేకర్స్ ను స్థాపించారు. కాలక్రమేణా ఇప్పుడది అగ్ర తెలుగు చలనచిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా పేరొందింది. మోహన్ చెరుకూరి వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ని ప్రారంభించేందుకు 2019లో తప్పుకున్నందున, ప్రస్తుతం, ప్రొడక్షన్ హౌస్‌కి నవీన్ యెర్నేని, రవి శంకర్ నాయకత్వం వహిస్తున్నారు.


Also Read : HCL Tech Center In Hyderabad: హైదరాబాద్‌లో హెచ్​సీఎల్ కొత్త టెక్ సెంటర్, దావోస్‌లో రేవంత్ రెడ్డితో ఒప్పందం - 5000 ఉద్యోగాలు కన్ఫామ్