Euphoria Musical Night | అమరావతి: ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో విజయవాడ వేదికగా తలసేమియా వ్యాధిపై అవగాహన కల్పించనున్నారు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 15న ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ‘యుఫోరియా మ్యూజికల్ నైట్’ నిర్వహించనున్నామని ఎన్టీఆర్ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు (Chandrababu) హాజరవుతారని, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ను కూడా ఆహ్వానిస్తామని ఆమె తెలిపారు.

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఈ కార్యక్రమం గురించి నారా భువనేశ్వరి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘యుఫోరియా మ్యూజికల్ నైట్’ కార్యక్రమానికి హాజరు కావడానికి సీఎం చంద్రబాబు అయినా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయినా టికెట్లు కొనాల్సిందే. ఫ్యామిలీతో హాజరయ్యేందుకు వారు బుక్ మై షోలోగానీ, ఇతర విధానంలో టేబుల్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సినిమాల్లో సక్సెస్ అయిన నా తండ్రి, స్వర్గీయ ఎన్టీఆర్ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. కేవలం రూ.2 కు కిలో బియ్యం ఇచ్చి పేదల ఆకలి తీర్చారు. మహిళలకు ఆస్తిలో సమానహక్కు అవకాశం కల్పించింది ఆయనే. ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తూనే, మరోవైపు అభివృద్ధి వైపు ఫోకస్ చేశారు. అదే బాటలో చంద్రబాబు నడుస్తున్నారు. ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ స్థాపించి ప్రభుత్వ సహాయం లేకుండానే ముందుకు వెళ్తున్నాం. తుపానులు లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించి ఎంతో మందిని ఆదుకున్నాం. మా వంతు సాయం కూడా చేసి బాధితులకు అండగా నిలిచాం’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ థమన్‘తలసేమియా సమస్య తీవ్రత అందరికీ తెలిసిందే. ఈ వ్యాధి ఉన్న వారికి సహాయం చేసేందుకు బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా సేవలు అందిస్తున్నాం. బడ్ల్‌ డొనేషన్ ఆపదలో ఉన్న ఒకరి ప్రాణాన్ని సైతం నిలుపుతుంది. కానీ కొందరిలో రక్తదానం అంటే భయం నెలకొంది. మనం ఇచ్చే రక్తం మరొకరి జీవితాన్ని నిలుపుతుంది.తలసేమియా వ్యాధిపై అవగాహన కోసం ‘యుఫోరియా మ్యూజికల్ నైట్’ నిర్వహించి దీని ద్వారా వచ్చే నగదును పేషెంట్ల కోసం వినియోగిస్తాం. ఈ కార్యక్రమం కోసం అడిగిన వెంటనే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అంగీకరించారు. బుక్‌ మై షోలో టికెట్స్‌ అందుబాటులో ఉంచుతాం. ఓ మంచి పని కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా వచ్చి పాల్గొనండి. మీరు టికెట్స్‌ డబ్బులను సేవా కార్యక్రమం లాంటి మంచి పనులకు వినియోగిస్తామని’ ఎన్టీఆర్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు.

ఎంతో గౌరవంగా భావిస్తా: థమన్ఎన్టీఆర్ ట్రస్ట్‌తో కలిసి ఓ మంచి పనిచేసే అవకాశం తనకు దక్కడంపై మ్యూజిక్ డైరెక్టర్ థమన్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో థమన్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా బాధితులకు అండగా నిలుస్తోంది. అందులో భాగంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో ‘యుఫోరియా మ్యూజికల్ నైట్’ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 15న ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో నిర్వహించనున్న ఈ కాన్సర్ట్‌ను కుటుంబంతో వచ్చి విజయవంతం చేయాలని, మంచి పనిలో మీరు భాగస్వాములు కావాలన్నారు. బాలకృష్ణ నటించిన అఖండతో పాటు ఇటీవల విడుదలై హిట్ మూవీ డాకు మహారాజ్‌కు థమన్ సంగీతం అందించారని తెలిసిందే.