దేశంలో ఒమిక్రాన్ ఆందోళన రోజు రోజుకూ పెరుగుతున్నాయి. విదేశాల నుంచి బెంగళూరు వచ్చిన ఇద్దరికీ ఒమిక్రాన్ సోకినట్లు గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజాగా విదేశాల నుంచి హైదరాబాద్ కు వచ్చిన వారిలో 12 మందికి కోవిడ్‌ పాజిటివ్‌ నిర్థారణ అయింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిన్న, ఈరోజు బ్రిటన్, కెనడా, అమెరికా, సింగపూర్‌ నుంచి వచ్చిన 12 మందికి కరోనా నిర్థారణ అయినట్లు అధికారులు తెలిపారు. కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన 12 మందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు తెలిపారు. కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారిలో కరోనా లక్షణాలు కనిపించలేదన్నారు. ఒమిక్రాన్‌ నిర్ధారణ కాకపోతే వీరందరినీ హోం ఐసోలేషన్‌కు పంపనున్నట్లు అధికారులు వెల్లడించారు.


Also Read: ఒమిక్రాన్ భయాల వేళ ఊరట.. దేశంలో 10 వేలకు దిగువనే కొత్త కేసులు


బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకూ పాజిటివ్


విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ గణేష్‌ నగర్‌ సమీపంలోని రిడ్జ్‌ టవర్స్‌కు చెందిన మహిళ బుధవారం బ్రిటన్ నుంచి నగరానికి వచ్చారు. ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ ఫలితాల్లో మహిళకు నెగెటివ్‌ వచ్చిందని ఎయిర్‌పోర్టు సిబ్బంది ఆమెను ఇంటికి పంపించారు. కానీ కాసేపటి తర్వాత రిపోర్టును పరిశీలించిన సిబ్బంది ఆ మహిళకు పాజిటివ్‌ వచ్చినట్లు గుర్తించి జీడిమెట్ల పోలీసులకు సమచారం అందించారు. దీంతో సీఐ బాలరాజు రిడ్జ్‌ టవర్స్‌ అసోసియేషన్‌కు సమాచారం అందించారు. దీంతో మహిళకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలియజేశారు. అనంతరం అక్కడికి చేరుకున్న జీడిమెట్ల పోలీసులు మహిళకు వివరించి ఆమెను నగరంలోని టిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మరోసారి ఆమెకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆమెకు పాజిటివ్‌గా తేలింది. ఆ నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పంపించారు. మహిళ ప్రైమరీ కాంటాక్ట్స్ ను హోంక్వారంటైన్‌ చేశారు. 


Also Read: దేశంలోకి 'ఒమిక్రాన్' ఎంట్రీ.. అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక


బెంగళూరులో తొలి ఒమిక్రాన్ కేసు


దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వైరస్ భారత్ కూడా అడుగుపెట్టింది. బెంగుళూరులో రెండు కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరిలో ఈ వైరస్ లక్షణాలు కనిపించినట్టు చెప్పింది. ఆ  ఇద్దరిలో ఒక వ్యక్తికి 66 ఏళ్లు అతను దక్షిణాఫ్రికా పౌరుడు.  మరో వ్యక్తి  బెంగళూరుకు చెందిన 46 ఏళ్ల ఓ వైద్యుడు. వీరిద్దరితో ఎవరెవరు కాంటాక్ట్ లో ఉన్నారు కూడా కనిపెట్టారు అధికారులు. అనస్తీషియన్‌కు నవంబర్ 22న కరోనా పాజిటివ్ గా తేలింది. అతనితో ప్రైమరీ కాంటాక్ట్ లో ఉన్న అయిదుగురు వ్యక్తులు కూడా కరోనా పాజిటివ్ గా తేలారు. వారి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షకు పంపించారు. ఆ డాక్టర్ ను, అతడిని నేరుగా కలిసిన 13 మంది వ్యక్తులను, అలాగే 205 సెకండరీ కాంటాక్టులు అంటే ఆ పదమూడు మంది కలిసిన వ్యక్తులను కనిపెట్టి... అందరినీ ఆసుపత్రిలోనే ఐసోలేట్ చేశారు. 


Also Read: 'ఒమిక్రాన్‌'పై గుడ్‌ న్యూస్.. ప్రపంచమా ఊపిరి పీల్చుకో.. డెల్టా కంటే డేంజరస్ కాదట!


 ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరికి పాజిటివ్


నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న చిన్నారులకు కరోనా ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. కోటగల్లీలోని బీసీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ లో గత 2 రోజులుగా కరోనా ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో ఒక ఉపాధ్యాయురాలికి, మోపాల్ కు చెందిన 4వ తరగతి విద్యార్థినికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులలో ఆందోళన నెలకొంది. ఈ రెసిడెన్షియల్ స్కూల్ లో మొత్తం 152 మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని నిర్థారించారు. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి