YS Vijayamma News: హైదరాబాద్ లోని వైఎస్ షర్మిల నివాసం లోటస్ పాండ్ వద్ద చెలరేగిన ఉద్రిక్తత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరాయి. నిరుద్యోగ దీక్ష చేపట్టడానికి షర్మిల ధర్నా చౌక్ కు వెళ్తుండగా ఇంటి దగ్గరే ఆపేసిన పోలీసులను వైఎస్ షర్మిల నెట్టేయడం, ఎస్సై, కానిస్టేబుల్ పై చేయి చేసుకోవడంతో షర్మిల అరెస్టు అయ్యారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు 330, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. 


వైఎస్ షర్మిలను పోలీస్ స్టేషన్ కు తరలించగానే, ఆమె తల్లి విజయమ్మ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఎందుకు అరెస్టు చేశారని పోలీసులను నిలదీశారు. కానీ, ఆమెను పోలీసులు పోలీస్ స్టేషన్ లోకి షర్మిలను చూసేందుకు వెళ్లనివ్వలేదు. ఆమెను అక్కడి నుంచి లోటస్ పాండ్‌కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించే క్రమంలో తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే విజయమ్మ పోలీసుపై చేయి చేసుకున్నారు. ఆమెను నియంత్రిస్తున్న మహిళా పోలీసు చెంపపై కొట్టారు. విజయమ్మను కారు బలవంతంగా ఎక్కించే ప్రయత్నంలో భాగంగా ఓ దశలో తీవ్ర అసహనానికి గురైన ఆమె ఆగ్రహంతో కానిస్టేబుల్ చెంప చెళ్లుమనిపించారు.


పోలీసుల తీరు అభ్యంతరకరంగా ఉందని, డ్రైవర్‌పై, షర్మిలపై తొలుత వారే దౌర్జన్యం చేశారని విమర్శించారు. ప్రశ్నిస్తున్న గొంతు మీదే పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని అన్నారు. వీళ్లకు చేతనైంది షర్మిలను అరెస్టు చేయడమే అని విమర్శించారు. తనను పోలీస్ స్టేషన్ లోనికి వెళ్లనిచ్చేవరకూ అక్కడే ఉంటానని విజయమ్మ తేల్చి చెప్పారు. స్టేషన్ ముందే తన కారులో కూర్చొని నిరసన తెలిపారు.


లోటస్ పాండ్‌కి తరలింపు


వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేయడం, పోలీసులపై చేయి చేసుకున్న దృశ్యాలు మీడియాలో పదే పదే ప్రసారం అవుతుండడంపై వైఎస్ విజయమ్మ లోటస్ పాండ్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఇది అసమర్థ ప్రభుత్వం అని కొట్టిపారేశారు. ఎప్పుడు చూసినా తమ ఇంటి చుట్టూ పోలీసులు ఉంటారని, షర్మిల ఏమైనా టెర్రరిస్టా? హంతకురాలా అని ప్రశ్నించారు.


‘‘వైఎస్ షర్మిల డ్రైవర్ ను కొట్టారు. గన్ మెన్లను లాగేశారు. ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించారు. ఆ ఆవేశంలో షర్మిల, నేను చెయ్యి అలా అన్నాము. మీడియాలో పదే పదే అదే చూపిస్తున్నారు. కొట్టాలంటే ఎంత గట్టిగా అయినా కొట్టొచ్చు. ఏమైనా చేయొచ్చు. కానీ కొట్టాలనే ఉద్దేశం షర్మిలకు లేదు, నాకూ లేదు’’


‘‘న్యాయంగా ప్రశ్నిస్తున్న గొంతును ఎంత కాలం అణచివేస్తారు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే ప్రభుత్వాలు దానికి సొల్యుషన్ చూపించాలి. బలం ఉందని చెప్పి పది మంది పోలీసులు ఆడబిడ్డపైన దౌర్జన్యం చూపారు. అందరూ మీద పడుతుంటే ఆవేశం రాదా? ప్రశ్నించే గొంతును ఆపేస్తారా? మీ అందరికి దండం పెట్టి చెప్తున్నా.. దయచేసి మీడియాలో సరిగ్గా చూపించండి. ప్రజల కోసం మీడియా కూడా పోరాడాలి. నేను, షర్మిల పోలీసులను కొట్టామని అవే దృశ్యాలు తిప్పి తిప్పి చూపించడం సరికాదు. ఈ ధోరణిని మీడియా, పోలీసుల విజ్ఞతకే వదిలేస్తున్నా’’ అని విజయమ్మ మాట్లాడారు.