ఆడపిల్ల పెళ్లంటే ఒకప్పుడు గుండెల మీద కుంపటిలా భావించేవారు! ఒక అయ్య చేతిలో పెడితే బాధ్యత తీరిపోతుందనే భావన సగటు మిడిల్ క్లాస్ ఇళ్లలో ఉండేది! ఆర్ధిక స్థోమత లేని నిరుపేద కుటుంబాలైతే ఆడపిల్ల మెచ్యూరిటీ తీరకముందే పెళ్లిపీటలెక్కించే దౌర్భాగ్య పరిస్థితులు ఉండేవి! బాల్యవివాహాల ఘటనలు మొన్నటి వరకు ఎక్కడో చోట పొడచూపుతునే ఉండేవి! మనుషుల్లో వచ్చిన మార్పు, సమాజంలో వచ్చిన అవగాహన, ఆడపిల్లల్లో చదువుకోవాలనే తపన.. లాంటి అంశాలు బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేశాయి.18 ఏళ్లు, ఆపైన ఉంటేగానీ అమ్మాయి పెళ్లి గురించే ఆలోచించడం లేదు నేటితరం తల్లిదండ్రులు. వాళ్లు ఉన్నత చదువులు చదువుకుని, మంచి ఉద్యోగాలు చేయాలనే ఆసక్తిని ప్రోత్సహిస్తున్నారు. అవసరమైతే పెళ్లిని వాయిదా వేస్తామన్నా, అభ్యంతరం చెప్పడం లేదు.


26 ఏళ్లకు కశ్మీరీ యువతులకు పెళ్లిళ్లు


ఈ పరిణామాల క్రమంలో దేశంలో అమ్మాయిల సగటు పెళ్లి వయసు పెరిగిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. 2017 వివరాల ప్రకారం ఉన్న 22.1 ఏళ్ల సగటు కాస్త బెటరైంది. రిజిస్ట్రార్ జనరల్‌ ఆఫ్‌ ఇండియా కార్యాలయం వివాహ వయసులపై జరిపిన జాతీయ నమూనా సర్వేలో దేశవ్యాప్తంగా మహిళల సగటు వివాహ వయసు 22.7 ఏళ్లుగా వెల్లడైంది. 2020లో ఈ సర్వే జరిగినప్పటికీ వాటి విశ్లేషణ ఆలస్యమైంది. అందుకు సంబంధించిన గణాంకాలను ఆ కార్యాలయం ఇటీవల విడుదల చేసింది. అత్యధికంగా 26 ఏళ్లకు కశ్మీరీ యువతులకు పెళ్లిళ్లు జరుగుతుంటే, అత్యల్పంగా 21 ఏళ్లలోపే జార్ఖండ్, బెంగాల్‌ అమ్మాయిలు మ్యారేజీ చేసుకుంటున్నట్టు తేలింది.


23.5 ఏళ్లకు తెలంగాణ అమ్మాయిల పెళ్లిళ్లు


దేశ సగటు కంటే తెలంగాణ మెరుగైన పొజిషన్లో ఉందని తేలింది. సర్వే గణాంకాలను పరిశీలిస్తే 2017 నాటికి దేశంలో మహిళల వివాహ సగటు వయసు 22.1 ఏళ్లు. 2020 నాటికి అది 22.7 ఏళ్లకు చేరింది. ఆయా రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల ప్రకారం అమ్మాయిలు పెళ్లి చేసుకొనే వయసు ముడిపడి ఉన్నందున వివిధ రాష్ట్రాల మధ్య యావరేజి వయసులో స్పష్టమైన తేడాలు కనిపిస్తున్నాయి.


వివాహ సగటు వయసుకు సంబంధించి తెలంగాణ గణాంకాలను పరిశీలిస్తే పట్టణ ప్రాంతాల్లో 2020 నాటికి 24.3 ఏళ్లు. గ్రామీణ ప్రాంతాల్లో 22.8 ఏళ్లు. సగటున 23.5 ఏళ్లకు తెలంగాణ అమ్మాయిలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారని సర్వేలో తేలింది. ఇక దక్షిణ తెలంగాణతోపాటు తమిళనాడు మహిళలకు కొంత ఆలస్యంగా పెళ్లిళ్లు జరుగుతున్నాయని సర్వేలో వెల్లడైంది. ఇదిలావుంటే, దేశంలోనే అత్యధికంగా సగటున 26 ఏళ్లకు కాశ్మీరీ మహిళలు వివాహాలు చేసుకుంటున్నారు. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌ యువతులు మాత్రం సగటున 21 ఏళ్లలోపే మూడుముళ్ల బంధంలోకి అడుగుపెడుతున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో గ్రామీణ మహిళల కంటే పట్టణ ప్రాంతాల్లోని యువతులే కొంత లేటుగా మ్యారేజీ చేసుకుంటున్నారని జాతీయ నమూనా సర్వే వెల్లడించింది.  


6 చట్టాలకు సవరణలు చేయాలి


దేశంలోని మహిళల చట్టబద్ధ కనీస వివాహ వయసు ప్రస్తుతం 18 ఏళ్లు. దాన్ని పురుషుల చట్టబద్ధ కనీస వివాహ వయసు 21 ఏళ్లకు సమానంగా పెంచాలని కేంద్రం ఇటీవలే నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సవరణ బిల్లును తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇది పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ దగ్గర పరిశీలనలో ఉంది. అయితే దేశంలో కనీస వివాహ వయసును మార్చాలంటే కేంద్రం 6 చట్టాలకు సవరణలు చేయాల్సి ఉంది.