వివేక హత్య కేసులో కేంద్రదర్యాప్తు సంస్థ విచారణకు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి హాజరయ్యారు. హైదరాబాద్‌ కోఠి సిబిఐ కార్యాలయానికి తన అనుచరులతో కలిసి చేరుకున్నారు. ఆయన ఒక్కరి వెహికల్‌ను మాత్రమే అధికారులు సీబీఐ కార్యాలయం ప్రాంగణంలోకి అనుమతి ఇచ్చారు. మిగతా వాహనాలను అక్కడే ఆపేశారు. ఈ కేసులో సీబీఐ విచారణకు అవినాష్ రావడం ఇది ఐదోసారి. 


అవినాష్ రెడ్డి విచారణ ఇవాల్టి నుంచి ఆరు రోజుల పాటు సాగే ఛాన్స్ ఉంది. కోర్టు ఆదేశాలతో ఆయన్ని ఉదయం నుంచి సాయంత్ర వరకు విచారించనున్నారు. విచారణ మొత్తం వీడియో చిత్రీకరించాలని కూడా కోర్టు ఆదేశించింది. ఆరు రోజులు పాటు ఆయన్ని  విచారించవచ్చని అయితే అరెస్టు మాత్రం చేయొద్దని స్పష్టం చేసింది. దీంతో ఆరు రోజుల పాటు అవినాష్ ను సీబీఐ విచారించనుంది. 


మరోవైపు ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులు అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్‌ రెడ్డి, ఉదయ్‌కుమార్‌ రెడ్డిని కూడా సీబీఐ కస్టడీలోకి తీసుకున్నారు. వాళ్లిద్దరి కూడా ఇవాల్టి నుంచి ఆరు రోజుల పాటు విచారించనుంది. ప్రస్తుతం వాళ్లిద్దరు చంచల్ గూడా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వాళ్లను కస్టడీలోకి తీసుకున్న సీబీఐ అధికారులు వైద్య పరీక్షలు చేసిన తర్వాత సీబీఐ కార్యాలయానికి తరలించారు.  


ఈ ముగ్గుర్ని ఒకే చోట విచారిస్తారా లేకుంటే వేర్వేరుగా విచారిస్తారా అనేది మాత్రం క్లారిటీ లేదు. కేసు తీవ్రతను బట్టి ముగ్గుర్ని కలిపి విచారించే అవకాశం లేకపోలేదని మాత్రం తెలుస్తోంది. దీనిపై సాయంత్రానికి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. 


వివేక హత్య కేసులో ఏ 6గా ఉన్న ఉదయ్‌కుమార్‌ను ఏప్రిల్‌ 14న సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల తర్వాత ఏ7గా ఉన్న వైఎస్ భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేశారు. వీళ్లిద్దర్ని కోర్టులో ప్రవేశ పెడితే న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం వాళ్లను చంచల్‌గూడా జైలుకు తరలించారు. 


భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను ఆరు రోజుల కస్టడీకి సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఇవాల్టి నుంచి 24 తేదీ వరకు విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేయాలని కోర్టు ఆదేశించింది. 


భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన తర్వాత కోర్టుకు సీబీఐ సమర్పించిన రిమాండ్ రిపోర్‌లో కీలక విషయాలు వెల్లడించింది.  భాస్కర్ రెడ్డి పారిపోతారని భావించి ముందే అరెస్ట్ చేశామని వెల్లడించింది. అతడు విచారణకు అందుబాటులో లేకుండా పోయే ప్రమాదముందని, కీలకసాక్షలను ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో అరెస్ట్ చేయాల్సి వచ్చిందని వివరించింది. విచారణకు వైఎస్ భాస్కర్ రెడ్డి సహకరించడంలేదని, విచారణను తప్పుదోవ పట్టించేలా సమాధానాలు ఇచ్చారని సీబీఐ వెల్లడించింది.  వివేకాపై భాస్కర్ రెడ్డి కుటుంబం అసంతృప్తితో ఉందని, 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి వివాదం ఉందని తెలిపింది. ఈ మేరకు భాస్కర్ రెడ్డి అరెస్ట్ కారణాలను సీబీఐ రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. హత్యాస్థలంలో ఆధారాలు చెరిపివేయడంలో భాస్కర్ రెడ్డిది కీలకపాత్ర అని సీబీఐ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. నెల ముందే వివేకా హత్యకు కుట్ర పన్నారని, భాస్కర్ రెడ్డి ఆదేశాలతోనే హత్యకు కుట్ర జరిగిందని వివరించింది. సీఐ శంకరయ్యను భాస్కర్ రెడ్డి బెదిరించారని తెలిపింది. వివేకా హత్యలో సహనిందితులకు పెద్దమొత్తంలో డబ్బు అందిందని వెల్లడించింది.


ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లోనూ సీబీఐ కీలక విషయాలు వెల్లడించింది.  వైఎస్ వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు చిత్రీకరించేందుకు ఉదయ్ కుమార్ రెడ్డి ప్రయత్నించినట్లు పేర్కొంది. హత్య అనంతరం ఆధారాలు చెరిపివేసేందుకు ఉదయ్ ప్రయత్నించినట్లు   వెల్లడించింది. హత్య జరిగిన రోజు ఉదయ్ కుమార్ ఉదయం 4 గంటలకే ఇంటినుంచి వెళ్లాడు. ఆ రోజు మెుత్తం.. ఎంపీ అవినాష్‌ ఇంట్లోనే ఉదయ్‌, శివశంకర్‌రెడ్డి ఉన్నారు. హత్య తర్వాత.. ఆధారాల చెరిపివేతకు ఎదురు చూశారన్నారు.  హత్య జరిగిన స్థలంలోనే అవినాష్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి, గంగిరెడ్డి, శివశంకర్‌ రెడ్డితో కలిసి ఉదయ్‌ ఆధారాలు చెరిపివేశారనేందుకు సాక్ష్యాలున్నాయి. ఆ రోజు అవినాష్‌ ఇంట్లోనే ఉదయ్‌, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి ఉన్నట్లు గూగుల్‌ టేక్‌అవుట్‌ ద్వారా గుర్తించాం. వారు అవినాష్ ఇంటి నుంచి వివేకా ఇంటికి వెళ్లినట్లు గుర్తించామని సీబీఐ తెలిపింది.