హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. ముగ్గుర్ని అరెస్టు చేయడం సంచలనంగా మారింది. ఓ హత్య కేసులో ఆరా తీస్తే మావోయిస్టులతో సంబంధాలు వెలుగు చూశాయని తేలింది. దీంతో న్యాయవాదులుగా పని చేస్తూ యువతను ఉగ్రవాదంవైపు మళ్లిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాళ్లను ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. 


హైదరాబాద్ శివారులో ఇద్దరు మహిళ న్యాయవాదుల ఇళ్లలో మూడు గంటల పాటు ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. చిలకానగర్‌లోని న్యాయవాది శిల్ప, మేడిపల్లి పర్వతాపూర్‌కు చెందిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు ప్రభాకర్‌ భార్య , న్యాయవాది దేవేంద్ర నివాసంలోనూ సోదాలు జరిగాయి. మెదక్ జిల్లాలోని గుంటలో దుబాసి స్వప్న నివాసంలో సైతం సోదాలు జరిపారు.


సాయంత్రానికి న్యాయవాది శిల్ప, దేవేంద్రను అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి కార్యాలయానికి తరలించారు. తమ కుమార్తె రాధను నర్సింగ్‌ చదివిస్తామని 2017లో హైదరాబాద్‌ నుంచి నరేందర్‌ అనే వ్యక్తి తీసుకువెళ్లాడని అప్పటి నుంచి ఆమె కనిపించకుండా పోయిందని యువతి తల్లి పోచమ్మ ఈ ఏడాది జనవరిలో ఫిర్యాదు చేసింది. విశాఖపట్నం జిల్లా పెద్దబయుల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రాధ కనిపించడం లేదంటూ రిజిస్టర్‌ పోస్టులో ఫిర్యాదు లేఖ పంపించింది. వీళ్లపైనే ఆమె అనుమానం వ్యక్తం చేశారు. 


చైతన్య మహిళ సంఘానికి చెందిన నరేందర్‌, దేవేంద్ర, స్వప్న, శిల్ప తమ ఇంటికి తరచు వస్తుంటారని 2017 డిసెంబరులో తమ కుమార్తెను నర్సింగ్‌ కోర్సు చదివిస్తామని నమ్మించి నరేందర్‌ తీసుకువెళ్లాడని ఫిర్యాదులో తెలిపింది పోచమ్మ. అప్పటి నుంచి రాధ ఇంటికి తిరిగిరాలేదని ఆమె ఆచూకీ కూడా తెలియలేదని తెలిపింది. కొన్ని రోజుల క్రితం ఏవోబీ వద్ద రాధ అలియాస్‌ నిల్చో పేరిట మావోయిస్టు లేఖలు విడుదలవుతున్నాయని.. దీంతో తమ కుమార్తె అపహరించి తీసుకువెళ్లి మావోయిస్టు దళంలో చేర్పించారని ఫిర్యాదులో పేర్కొంది. 


విశాఖపట్నం పెద్దబయుల పోలీస్‌స్టేషన్‌ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లారు.  అనంతరం ఎన్‌ఐఏ కేసు దర్యాప్తు చేయాల్సిందిగా కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో జూన్‌ 3న ఎన్‌ఐఏ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. మావోనేతలు గాజర్ల రవి చైతన్య మహిళ సంఘంలో పనిచేసిన శిల్ప, దేవేంద్ర, స్పప్న, నరేందర్‌ నివాసాల్లో ఎన్‌ఐఏ సోదాలు జరిపింది. వారందరినీ అదుపులోకి తీసుకుని మాదాపూర్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయానికి తరలించారు.


రాధను ఎక్కడకు తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉంది అనే కోణంలో వారిని విచారిస్తున్నారు. వారి కాల్‌డేటాను పరిశీలిస్తున్నారు. అయితే ఎన్‌ఐఏ సోదాలపై తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని శిల్ప ప్రస్తుతం చైతన్య మహిళా సంఘంలో లేరని ఆమె భర్త కిరణ్‌ తెలిపారు. గతంలో మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ అని సంఘంపై అభియోగాలు వేస్తున్నారని శిల్ఫా బయటకు వచ్చినట్టు చెప్పారు. ఇబ్బందులకు గురిచేయడానికే ఇలాంటి కేసులు పెడుతున్నారని ఆరోపించారు.


దేవేంద్రను ఎన్‌ఐఏ అక్రమంగా తీసుకువెళ్లిందని, ఆమెకు ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదని తల్లి యాదమ్మ తెలిపింది. కేంద్ర హోంశాఖ జోక్యంతో రాధా మిస్సింగ్ కేసును ఎన్‌ఐఏ సీరియస్‌గా తీసుకుంది. యువతను తీవ్రవాదం వైపు మళ్లించి మావోయిస్ట్ పార్టీ లో చేర్చుతున్నారని ఎన్ఐఏ అనుమానం వ్యక్తంచేస్తోంది. అందుకే గతంలో చైతన్య మహిళ సంఘంలో పని చేసిన శిల్పా, దేవేంద్ర అరెస్ట్ చేశారు ఎన్‌ఐఏ అధికారులు.. హైదరాబాద్‌లో వైద్య పరీక్షల అనంతరం, వారిని విజయవాడకు తరలించారు. ఇవాళ(శుక్రవారం) విజయవాడ న్యాయస్థానంలో హాజరు పరచునున్నారు.