భారత్ జోడో యాత్రపై, టీఆర్ఎస్‌తో పొత్తు లేదని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ చేయాల్సింది భారత్ జోడో యాత్ర కాదని, కాంగ్రెస్ జోడో యాత్ర చేయాలని కేటీఆర్ సూచించారు. నేతలు ఇప్పటికే కాంగ్రెస్ చోడో అని పారిపోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్యాకుమారి నుంచి మొదలుపెట్టిన రాహుల్ గాంధీ నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్ లో ఎందుకు యాత్ర చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది, రాహుల్ గాంధీ ఇంకా భ్రమల్లోనే ఉన్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
3 వేల ఓట్లకు పరిమితమైన కాంగ్రెస్ !
తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నేత జానారెడ్డిని మించిన వ్యక్తిని లేరని కేటీఆర్ అన్నారు. 7 పర్యాయాలు ఎన్నికల్లో నెగ్గిన జానారెడ్డిని టీఆర్ఎస్ యువ నేత నోముల భగత్ ఓడించారని టీ న్యూస్‌తో మాట్లాడుతూ కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు నేతలు పార్టీని వీడుతున్నారని, మరోవైపు ఎన్నికల్లో ఓట్లు సంపాదించలేని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎక్కడుందో చెప్పాలని రాహుల్ ను ప్రశ్నించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీలు, ప్రచారం, హంగామా కోట్ల రూపాయలు ఖర్చు చేసినా చివరికి ఆ పార్టీ సాధించింది కేవలం 3 వేల ఓట్లు అని కేటీఆర్ గుర్తు చేశారు.
బీజేపీ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఇదేనా !
టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో, కేంద్ర ప్రభుత్వంతో పోరాటం సాగిస్తుందని, కానీ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పోరాటం చేయలేదని విమర్శించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగిస్తున్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీలో ముగించుకుని రాహుల్ తెలంగాణకు వచ్చారు. ఇక్కడ పాదయాత్ర ముగించుకుని మహారాష్ట్రకు వెళ్లామన్నారు. అక్కడ రైట్ టర్న్ తీసుకుని మధ్యప్రదేశ్ వెళ్లారట. అక్కడి నుంచి గుజరాత్ కు వెళ్లకుండా ముందుకు వెళ్తామన్న రాహుల్ గాంధీ యాత్రపై కేటీఆర్ ప్రశ్నాస్త్రాలు సంధించారు. నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్న గుజరాత్ లో ఎందుకు పాదయాత్ర చేయరో అర్థం కావడం లేదన్నారు.
‘రాహుల్ గాంధీకి, ప్రధాని నరేంద్ర మోదీకి మధ్య చీకటి ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా. భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్.. కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఎందుకు పాదయాత్ర చేయరు. మోదీతో ఎందుకు పోరాటం చేయరు. గుజరాత్ లో బీజేపీతో తలపడకుండా కాంగ్రెస్ ఎందుకు తప్పించుకుంటుంది. 76 ఏళ్ల సోనియా గాంధీ తప్పుకుని, 80 ఏళ్ల మల్లిఖార్జున ఖర్గేను కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసి యువతను ఆకర్షించడం సాధ్యమేనా. రాహుల్ గాంధీ ముందు కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించాలని, ఆ పార్టీతో పొత్తు కోసం ఎవరూ వెంపర్లాడటం లేదని’ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
సొంత ఇలాకాలో నెగ్గని రాహుల్..
కనీసం తన సొంత నియోజకవర్గం అమేథి పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోలేని అంతర్జాతీయ లీడర్ రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను విమర్శించడం సరికాదన్నారు మంత్రి కేటీఆర్. కేసీఆర్‌తోపాటు ఆయన జాతీయ పార్టీ ఆకాంక్షపై కూడా విమర్శలు చేయడం సహేతుకం కాదన్నారు. ప్రధాని కావాలని కలలు కంటున్న రాహుల్ గాంధీ ముందు తన అమేథీ ప్రజలను ఒప్పించి ఎంపీగా ఎన్నిక కావాలంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.