ఓ (ఆంధ్రజ్యోతి) దినపత్రికలో ఏప్రిల్ 10న “చాంబర్లు ఏవీ?” అనే శీర్షికతో ప్రచురితమైన వార్తా కథనంపై ఆర్‌అండ్‌బీ శాఖ స్పందించింది. ఆ పత్రిక కథనంలో సెక్రటరీ కేడర్ కంటే కిందిస్థాయి అధికారులకు ఛాంబర్లు లేవని పేర్కొనడం పూర్తిగా నిరాధారమైనది, అసంబద్ధమైనదని ఆ శాఖ కొట్టిపారేసింది. కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్లో అసలు ఓపెన్ ఆఫీస్ విధానాన్నే అవలంబించడం లేదని తెలిపింది. మంత్రి పీఎస్‌లు ఓఎస్డీలు, పీఏలకు ఛాంబర్లు ఏర్పాటు చేశామని.. కొత్తగా నిర్మించిన సచివాలయంలో ఛాంబర్ల కొరత లేనేలేదని R&B ఈఎన్సీ గణపతిరెడ్డి వివరణతో కూడిన లేఖ విడుదల చేశారు.
ఆ దినపత్రిక రాసింది ఇదే:
CMO అధికారులు సెక్రటేరియట్ విజిట్ చేసినట్టు, చాంబర్స్ విషయంలో R&B ఈఎన్సీపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు.. ఈ గదుల్లో ఎలా పరిపాలన చేస్తారంటూ సీఎంవో అడిగినట్టు.. పాత సచివాలయం కంటే కొత్త సచివాలయం స్పేసే తక్కువ అని.. అధికారుల గదుల విషయంలో ఎందుకింత నిర్లక్ష్యమంటూ సీఎంవో రుసరుసలాడినట్టు ఆంధ్రజ్యోతి కథనం రాసింది. పాత సచివాలయం కంటే కొత్త సెక్రటేరియట్‌కు అదనంగా మూడెకరాల స్సేస్ కలిసి వచ్చినా, ఆ మేరకు సౌకర్యలు పెరగలేదని కథనంలో రాశారు. కేవలం అలంకరణకు ప్రాధాన్యత ఇచ్చి, అవసరాలను మరిచారు అని రాశారు. ఈ విషయాలపై సచివాలయ వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నట్టు వార్తలో పేర్కొన్నారు. సీఎం చాంబర్, ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది, ఇతర శాఖల్లో.. మంత్రులు, కార్యదర్శి, ఆపై స్థాయి అధికారులకు తప్ప, ఇతర ర్యాంకు అధికారులకు ప్రత్యేక చాంబర్లు లేకపోవడాన్ని సీఎంవో వర్గాలు తప్పుబట్టినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయని కథనంలో పేర్కొన్నారు.
రీజాయిండర్ ముఖ్యాంశాలు లేఖలో కోట్
ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా, ఆధారం లేకుండా ఒక ఊహాజనితమైన వార్తాకథనం ప్రచురించి E-in-C (R&B)ని నిందించే ప్రయత్నం చేశారని లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రీజాయిండర్ ముఖ్యాంశాలును లేఖలో కోట్ చేశారు. పాత సెక్రటేరియట్ కాంప్లెక్స్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్రం కోసం కొత్త ఇంటిగ్రేటెడ్ సెక్రటేరియట్ కాంప్లెక్స్‌ను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ మంత్రులు, అధికారులు సిబ్బందికి కేటాయించిన స్థలంకంటే తెలంగాణ సెక్రటేరియట్లో ప్రస్తుతం మంత్రులు, సెక్రటరీలు సిబ్బంది కోసం నిర్మించిన విస్తీర్ణం ఎక్కువ. పాత సెక్రటేరియట్లో విచ్చలవిడిగా వివిధ భవనాలు ఉండేవి. కానీ కొత్త సచివాలయాన్ని సమీకృత సచివాలయ కాంప్లెక్సులో అన్ని విభాగాలను సమీకృతం చేయడం ద్వారా పనిస్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునే ఉద్దేశంతో అన్ని అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారు. అందులో 59 మంది ప్రిన్సిపల్ సెక్రటరీ/సెక్రటరీ(IAS)ల ఛాంబర్లు, పేషీలు, 36 మంది అదనపు సెక్రటరీ/జాయింట్ సెక్రటరీల ఛాంబర్లు, అటాచ్డ్ టాయిలెట్లు, పేషీలు. 53 డిప్యూటీ సెక్రటరీ ఛాంబర్లు పేషీలతో నిర్మించారు.
118 సహాయ కార్యదర్శుల ఛాంబర్లు, పెద్ద హాళ్లలో 1158 మంది సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు/TCAS తదితరుల కోసం క్లస్టర్డ్ వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇవన్నీ వాస్తవాలైనా, అవేవీ తెలియకుండా అడిషనల్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, పీఎస్ టు మినిస్టర్స్, ఓఎస్డీలు, డిప్యూటీ, అసిస్టెంట్ సెక్రటరీలకు ఛాంబర్లు లేవు.. వారు బహిరంగ ప్రదేశాల్లో పని చేయాల్సి ఉంటుందని ఊహాజనిత వార్త ప్రచురణ చేయడం సరైంది కాదని హితవు పలికారు. ఈ వార్త పూర్తిగా నిరాధారమైనదని గణపతి రెడ్డి కొట్టిపారేశారు.