రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్న వేళ నగరంలో వెలసిన బ్యానర్లు కలకం రేపుతున్నాయి. కొద్ది నెలల క్రితం దుమారం రేపిన డ్రగ్స్ వ్యవహారం కేంద్రంగా ఇప్పుడు రాహుల్ గాంధీపై ఫ్లెక్సీలు వెలిశాయి. హైదరాబాద్‌లో చాలా చోట్ల ఈ బ్యానర్లను కట్టారు. రాహుల్‌ జీ.. వైట్‌ ఛాలెంజ్‌కి మీరు సిద్ధమా అని ప్రశ్నిస్తూ ఆ బ్యానర్లు కట్టారు. హైదరాబాద్‌లో గన్‌పార్క్‌, ట్యాంక్‌ బండ్‌ దగ్గర ఈ బ్యానర్లను కట్టారు.


కొద్ది నెలల క్రితం వైట్ ఛాలెంజ్ దుమారం
తెలంగాణలో కొద్ది నెలల క్రితం డ్రగ్స్, గంజాయి భారీగా పట్టుబడ్డ సందర్భంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాలు చేసిన సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్ కూడా డ్రగ్స్‌ వాడతారంటూ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. దమ్ముంటే మంత్రి కేటీఆర్ పరీక్షలు చేయించుకొని డ్రగ్స్ జోలికి పోలేదని నిరూపించుకోవాలని సవాలు విసిరారు. అందుకు వైట్ ఛాలెంజ్ అని పేరు కూడా పెట్టారు. గాంధీ పార్క్ వద్దకు వస్తే తాము ఇద్దరం టెస్టులు చేయించుకుందామని, ఫలితాల ద్వారా డ్రగ్స్ కు వ్యతిరేకమని తామందరం యువ ప్రపంచానికి చాటుదామని చెప్పారు. ఈ అంశంపై విపరీతంగా ట్వీట్ల వార్ నడిచింది. 


రాహుల్‌ను లాక్కొచ్చిన కేటీఆర్
ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి కేటీఆర్‌కు సవాల్ విసరగా.. స్పందించిన కేటీఆర్ ప్రతిసవాల్ చేశారు. మీ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ముందు డ్రగ్స్ టెస్టు చేయించుకోవాలని, ఆయనకు ముందు క్లీన్ రిపోర్టు వస్తే అప్పుడు తాను పరీక్షలు చేయించుకుంటానని సవాలు చేశారు. అందుకు రాహుల్ సిద్ధమా? అంటూ ఛాలెంజ్ చేశారు. అప్పుడు కొద్ది రోజులకే సద్దుమణిగిపోయిన ఈ వైట్‌ చాలెంజ్‌ వ్యవహారం ఇప్పుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన సందర్భంగా మళ్లీ తెరపైకి వచ్చిది. ఇటీవల నేపాల్‌లో ఓ వివాహవేడుకలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ వీడియో వివాదాస్పదం కావడంతో ఆ స్క్రీన్ షాట్లతోనే కొందరు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వైట్‌ ఛాలెంజ్‌లో పాల్గొనేందుకు మీరు రెడీనా అంటూ రాహుల్‌ గాంధీకి సవాలు చేస్తున్నారు.


రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఇదీ


రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారయింది. ఈ మేరకు పార్టీ వర్గాలు రాహుల్ తెలంగాణ షెడ్యూల్ వివరాలను వెల్లడించాయి. రేపు (మే 5) రాహుల్ హైదరాబాద్ రానున్నారు. ప్రత్యేక విమానంలో సాయంత్రం 4:50కి ఢిల్లీ నుంచి శంషాబాద్ ఏయిర్ పోర్టుకు రాహుల్ గాంధీ చేరుకుంటారు. 5.10 గంటలకు ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ ద్వారా వరంగల్‌కు వెళ్తారు. 5.45కు వరంగల్‌లోని గాబ్రియోల్ స్కూలుకు చేరుకుంటారు. 


6:05 వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మళ్లీ రాత్రి 8 గంటలకు వరంగల్ నుండి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి రాత్రి 10:40 హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రికి బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణా హోటల్ లో బస చేస్తారు.


7వ తేదీ షెడ్యూల్ ఇదీ
రాహుల్ గాంధీ మధ్యాహ్నం 12:30కి హోటల్ తాజ్ కృష్ణా నుంచి బయలుదేరి 12:50కి సంజీవయ్య పార్కుకు చేరుకుంటారు. 12:50 - 1:10మధ్య దివంగత మాజీ సీఎం సంజీవయ్యకు నివాళులు అర్పిస్తారు. 1:15 కు సంజీవయ్య పార్కు నుంచి బయలుదేరి 1:30కి గాంధీ భవన్ చేరుకుంటారు. 1:45 నుంచి 2:45 వరకు గాంధీ భవన్ లో పార్టీ నాయకులతో సమావేశంలో పాల్గొంటారు.


1:45 నుంచి 2:50 వరకు మెంబర్ షిప్ కో ఆర్డినేటర్‌లో ఫోటోలు దిగుతారు. 3 గంటలకు గాంధీ భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరిగి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 5:50కి శంషాబాద్ ఏయిర్ పోర్టు నుంచి ఢిల్లీ వెళ్తారు.