ఈ వేసవి అదిరిపోతోంది. ఇంట్లో ఉంటే ఉక్కపోత.. బయటకొస్తే ఎండ మోత. ఊపిరి ఆడటం లేదు. అందుకే సమ్మర్ హాలిడేస్ వస్తే చాలా చల్లని ప్రదేశాలకు ఎగిరిపోవడానికి చాలా మంది ఎదురు చూస్తున్నారు. కొందరు ఊటీ లాంటి చల్లని ప్రదేశాలు వెళ్తే ఆ స్థాయి బడ్జెట్ లేని వాళ్లు లోకల్‌గా ఉండే వాటి కోసం వెతుకుతుంటారు.
అనంతగిరి హిల్స్
తెలంగాణలో సమ్మర్ టూరిజం అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది అనంతగిరి హిల్స్. హైదరాబాద్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రదేశం నేచర్ లవర్స్‌కు స్వర్గధామంగా చెప్పవచ్చు. అందుకే వీకెండ్ వస్తే చాలు చాలా మంది ట్రావెలర్స్ ఇక్కడ వాలిపోతుంటారు.
ప్రకృతిని ఆస్వాధించే వాళ్లకు, ట్రెక్కింగ్ చేయాలని ఉబలాటపడే వాళ్లకు ఇదో మంచి డెస్టినేషన్. సాహసాలు చేస్తూ థ్రిల్ ఫీల్ అయ్యే వాళ్లకి కూడా ఏమాత్రం నిరాశ పరచని ప్రదేశం ఇది.
ఏం చూడొచ్చు
ఇక్కడకు వెళ్లాలనుకునే వాళ్లు ప్రకృతితోపాటు ఆ ప్రాంత ప్రజల జీవస్థితిగతులు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గిరిజనుల జీవ విధానం ఆకట్టుకుంటుంది. వాళ్ల వస్త్రధారణ, వేసుకునే ఆభరణాలు, వాడుకునే వస్తువులు అన్నీ చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వారి సంప్రదాయాలు కూడా మిమ్మల్నీ ఎక్కడికో తీసుకెళ్తాయి. గిరిజనుల నైపుణ్యాన్ని తెలిపే వస్తువులు మైమరిపిస్తాయి.
పద్మాపురం బొటానికల్ గార్డెన్, అనంతపద్మనాభ స్వామి ఆలయం, నాగసముద్రం సరస్సు మీ టూర్ జ్ఞాపకాలను మరింత అందగా తీర్చిదిద్దుతాయి. ఇక్కడ దాదాపు 1200 మీటర్లు ఎత్తున్న కొండపై ట్రెక్కింగ్ సరికొత్త అనుభూతిని మిగిలిస్తే... ఇతర ప్రదేశాలు మర్చిపోలేని జ్ఞాపకాలను మదిలో నిలుపుతాయి.
భద్రాచలం
హాట్ సమ్మర్‌లో కూల్‌గా గోదావరి పక్కనే ఉండే భద్రచాలం చూడచక్కని ప్రదేశం. అందులో శ్రీరామ నవమి కూడా ఉంది. ఓవైపు ఆధ్యాత్మిక పర్యటన కూడా తోడవుతుంది. ఇక్కడ రాముడి ఆలయంతోపాటు అభయాంజనేయ స్వామి గుడి, పాపికొండలు, రాచంద్రస్వామి ఆలయం, పర్ణశాల, శబరి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రదేశాలు ఇక్కడ దర్శనం ఇస్తాయి.
హైదరాబాద్ చుట్టుపక్కల చాలా వాటర్ గేమింగ్ జోన్స్ ఉన్నాయి. ఇక్కడ సమ్మర్ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి. వీటికి తోడు కొన్ని రిసార్ట్స్ స్పెషల్ ఈవెంట్స్‌తో రా రమ్మని ఆహ్వానిస్తున్నాయి. చాలా ప్రైవేటు సంస్థలు బోలెడన్న ఆఫర్స్‌తో టూర్ ప్యాకేజీలు అందిస్తున్నాయి. ఒక్కసారి ఆన్‌లైన్‌లో మీరు సెర్చ్ చేస్తే మీ బడ్జెట్‌లో కూల్‌గా నచ్చిన ప్రదేశానికి వెళ్లి రావచ్చు.