Rains In Telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం, ద్రోణి కారణంగా తెలంగాణలో కూడా మూడు రోజుల పాటు వర్షాలు కుమ్మేయనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 25 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో వానలతోపాటు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని హెచ్చరించిందది.
ఎల్లో అలర్ట్ జారీ అయిన జిల్లాలు ఇవే
తెలంగాణలో ఆదివారం మధ్యాహ్నం నుంచే ఆవర్తనం, ద్రోణి ప్రభావం కనిపిస్తోంది. తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు దంచి కొడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్ జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మహబూబాబాద్ జిల్లా, వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లా, జనగాం జిల్లా, సిద్దిపేట జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, వికారాబాద్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, కామారెడ్డి జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూల్ జిల్లా, వనపర్తి జిల్లా, నారాయణపేట జిల్లా, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఇవాళ వర్షం కురిసే జిల్లాలు
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా, జగిత్యాల జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మహబూబాబాద్ జిల్లా, వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లా, జనగాం జిల్లా, సిద్ధిపేట జిల్లా, హైదరాబాద్ జిల్లా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, వికారాబాద్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, నాగర్ కర్నూల్ జిల్లా, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.
చాలా కాలం నుంచి తెలంగాణలో జోరుగా వానలు పడుతున్నాయి. అదే టైంలో ఉక్కపోత కూడా ఎక్కువగానే ఉంటోంది. వర్షం పడుతున్నా ఇంట్లో ఫ్యాన్, ఏసీ లేకపోతే ఉండలేని పరిస్థితి చాలా ప్రాంతాల్లో ఉంది. మరోవైపు కుండపోతగా కురిసిన వర్షాలకు నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. అయినా మారుతున్న వాతావరణంతోనే వ్యవసాయ పనులు ఊపందుకోవడం లేదు.
హైదరాబాద్‌లో వర్షాలు
హైదరాబాద్‌లో అయితే పరిస్థితి పూర్తిగా తేడాగా ఉంటోంది. అప్పటి వరకు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన కొద్ది కాలంలోనే వర్షం కుమ్మేస్తోంది. ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షంతో నీరు నిలిచిపోతోంది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ట్రాఫిక్ జామ్ అవుతోంది. కాసేపటికే అసలు వర్షం పడిందా అన్నట్టు పరిస్థితి మారిపోతోంది. విచిత్రమైన వాతావరణం చూసిన జనం ఆశ్చర్యపోతున్నారు. బయడటకు వెళ్లే పని ఉన్న వాళ్లంతా వెదర్ అప్‌డేట్ చూసుకొని మరీ బయల్దేరుతున్నారు.
ఆదివారం కూడా చాలా ప్రాంతాల్లో వర్షం కుమ్మేసింది. ముఖ్యంగా ఎల్బీనగరం ప్రాంతంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో జోరు వాన నగరవాసులను తడిసి ముద్దచేసింది. ఎల్బీనగర్ నుంచి సికింద్రాబాద్ వరకు ఇదే పరిస్థితి కనిపించింది. దీంతో సికింద్రాబాద్ నుంచి ఎల్బీనగర్ వరకు, ఎల్బీనగర్ నుంచి చాదర్ ఘాట్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.