ఏటీఎంలు కేవలం డబ్బులు తీసుకోడానికే కాకుండా వేర్వేరు అవసరాల కోసం కూడా అందుబాటులోకి వస్తున్నాయి. నీళ్ల కోసం కూడా ఏటీఎం తరహా యంత్రాలు గతంలోనే వచ్చాయి. కొద్ది నెలల క్రితం హైదరాబాద్ గోల్డ్ ఏటీఎంని కూడా పెట్టారు. తాజాగా డబ్ల్యూటీసీ అనే యత్రం అందుబాటులోకి వచ్చింది. దీని పూర్తి పేరు ‘వాటర్ - టీ - కాఫీ’. ఈ మూడు పానీయాలను ఇంకో వ్యక్తి సాయం లేకుండానే మిషన్ ద్వారా పొందవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేసిన ఈ యంత్రాన్ని హైదరాబాద్ లో పెట్టారు. హైదరాబాద్‌కు చెందిన వినోద్‌ కుమార్‌ అనే వ్యక్తి ఈ యంత్రాన్ని రూపొందించారు.


మరో వ్యక్తి అవసరం లేకుండా కేవలం క్యూఅర్ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా మనకి కావాల్సిన టీ, కాఫీ, వాటర్, బిస్కెట్స్ ఈ యంత్రం నుంచి వచ్చేస్తాయి. లక్ష రూపాయల ఖర్చుతో ఈ మెషిన్‌ని తయారు చేశామని దీని తయారీదారులు చెబుతున్నారు. సాధారణంగా ఎయిర్‌ పోర్టుల్లో, కార్పొరేట్ కంపెనీల్లో ఇలాంటి వెండింగ్ యంత్రాలు కనిపిస్తుంటాయి. వాటిలో బిస్కెట్లు, కూల్ డ్రింకులు, వాటర్ బాటిల్స్ ఉంటాయి. కానీ, టీ, కాఫీల్లాంటివి మాత్రం వాటిలో ఉండవు. ఈ యంత్రం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో పని చేస్తుందని, దానికోసం స్పెషల్ సాఫ్ట్‌వేర్‌ను తయారుచేశామని తయారీదారులు చెబుతున్నారు.


సాధారణంగా, కూల్ డ్రింకులు, బిస్కట్ ప్యాకెట్లు వచ్చే మెషిన్ల ఖర్చు రూ.4 నుంచి రూ.5 లక్షల వరకు ఉంటుందని.. తాము మాత్రం డబ్ల్యూటీసీ వెండింగ్ మిషన్‌ కేవలం రూ.లక్షకే తయారు చేశామని చెప్పారు. సెకన్ల వ్యవధిలోనే టీ, కాఫీ, వాటర్‌ ఇలా ఏదైనా వచ్చేస్తుందని చెప్పారు. కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా కావాల్సిన పానీయాలను పొందవచ్చు. డబ్ల్యూటీసీలో మొత్తం రెండు మెషిన్లను ఉంచారు. ఒక మెషిన్ నుంచి వాటర్ బాటిల్ వచ్చేలా చేశారు. మరో మెషిన్ లో పూర్తిగా టీ, కాఫీ వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. మిషన్ పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పేమెంట్ లింక్ ఫోన్‌లో వస్తుంది. యూపీఐ పేమెంట్ చేయడం ద్వారా పేమెంట్ పూర్తి కాగానే సెలెక్ట్ చేసుకున్న పానీయం వస్తుంది.


ఈ యంత్రంలో 100 నీళ్ల బాటిళ్లు, 200 టీ లేదా కాఫీ, 50 బిస్కెట్ ప్యాకెట్ల స్టాక్ ఉంచుతారు. నిల్వలు అయిపోయిన వెంటనే ఆ యంత్రం నిర్వహిస్తున్న వారికి ఒక అలర్ట్ వెళ్తుంది. వాళ్లు వెంటనే స్టాక్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ తరహా మెషిన్లను త్వరలో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేయనున్నారు. మొదటిసారిగా ఎల్బీ నగర్ ఎల్పీటీ మార్కెట్ భవనంలో దీనిని ప్రారంభించారు. జెమ్ ఓపెన్ క్యూబ్ సంస్థ ఆధ్వర్యంలో టెక్నాలజీని ఉపయోగించి దీనిని ప్రారంభించారు. నగర వ్యాప్తంగా ఈ మెషిన్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.