Warangal Preethi Death News: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న వైద్య విద్యార్థిని ప్రీతి పోరాటం ముగిసింది. ఆమె బ్రెయిన్ డెడ్ అయి మృతిచెందినట్లు ప్రకటించారు. ఆదివారం రాత్రి 9:10 గంటలకు ప్రీతి చనిపోయిందని వైద్యులు ప్రకటన చేశారు. 5 రోజులపాటు మృత్యువుతో పోరాడిన మెడికో ప్రీతిని బతికించేందుకు డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. హైదరాబాద్ లోని నిమ్స్ లో చికిత్స పొందుతూ మెడిసిన్ స్టూడెంట్ ప్రీతి చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
కేఎంసీ ( కాకతీయ మెడికల్ కాలేజీ)లో సీనియర్ సైఫ్ వేధిస్తున్నాడని ప్రీతి ఫిబ్రవరి 22న ఆత్మహత్యాయత్నం చేసింది. చనిపోదామని హానికర ఇంజెక్షన్ తీసుకుని అపస్మారక స్థితిలో ఉన్న ప్రీతిని గుర్తించి అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. 5 రోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితిలో ఏ మార్పు రాలేదు, వైద్యానికి ప్రీతి అవయవాలు స్పందించడం లేదని, ఆరోగ్యం మెరుగు అవుతున్న సూచనలు కనిపించడం లేదని మొదట్నుంచీ డాక్టర్లు చెబుతూనే ఉన్నారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూనే ప్రీతి ఆదివారం రాత్రి చనిపోయింది. ఆమె మరణంపై నిమ్స్ వైద్యులు ప్రకటన విడుదల చేశారు.
గాంధీలో ప్రీతికి పోస్టుమార్టం..
ప్రీతి మృతదేహాన్ని మరికాపేసట్లో నిమ్స్ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించనున్నారు. భారీ పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేసి అంబులెన్స్ లో గాంధీకి ప్రీతి మృతదేహాన్ని తరలించాలని చూస్తున్నారు. సోమవారం ఉదయం గాంధీ హాస్పిటల్ లో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. అయితే ప్రీతి కుటుంబానికి తీవ్ర అన్యాయం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు మృతదేహాన్ని తరలించేందుకు అంగీకరించేది లేదంటూ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు నిమ్స్ ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. వారిని నచ్చజేప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో నిమ్స్ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అదే సమయంలో వరంగల్ లోని ఎంజీఎం హాస్పిటల్, కాకతీయ మెడికల్ కాలేజీ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చేసేందకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. మెడికల్ స్టూడెంట్ ప్రీతి మరణానికి కారణమైన సైఫ్ ను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
గత ఏడాది డిసెంబర్ 6వ తేదీ నుంచి మూడుసార్లు పీజీ అనస్తీషియా ఫస్టియర్ స్టూడెంట్ ప్రీతికీ, సీనియర్ సైఫ్‌కీ మధ్య విభేదాలు వచ్చాయి. సార్ అని కచ్చితంగా పిలవాలని కండీషన్ పెట్టడం, కేస్ షీట్లు చెక్ చేసి తెలివిలేదు అంటూ గ్రూపులో మెస్సేజ్ లు పెట్టడంతో ప్రీతి భరించలేకపోయింది. తాను ఏమైనా తప్పు చేస్తే గ్రూపులో మెస్సేజ్ లు కాదు, హెచ్ఓడీకి ఫిర్యాదు చేయాలని ప్రీతి పలుమార్లు తన సీనియర్ సైఫ్ కు సూచించింది. అయినా పరిస్థితిలో మార్పు లేదు, ర్యాగింగ్ కొనసాగింది. వేధింపులు ఎక్కువ కావడంతో ప్రీతి ఒత్తిడికి లోనైంది. ఈ నెల 18న వాట్సాప్ గ్రూప్‌లో ప్రీతితో ఛాటింగ్ చేసి మరోసారి వేదించాడు సైఫ్. ఈ 20వ తేదీన సైఫ్ వేధింపుల గురించి తల్లిదండ్రులకు ప్రీతి వివరించింది. మేనేజ్ మెంట్ వద్దకు విషయం చేరడంతో ఫిబ్రవరి 21న సైఫ్, ప్రీతిని పిలిచి విచారించారు. ఈ క్రమంలో 22వ తేదీన హానికారక ఇంజెక్షన్ తీసుకుని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఇది ఆత్మహత్యాయత్నం కాదని, ప్రీతికి బలవంతంగా విషపు ఇంజెక్షన్ చేశారని.. డెడ్ బాడీని హైదరాబాద్ కు తరలించి ట్రీట్మెంట్ చేశారంటూ ప్రీతి తండ్రి, సోదరుడు ఆదివారం సంచలన ఆరోపణలు చేశారు. కూతురు బ్రెయిన్ డెడ్ అయిందని, బతికే అవకాశం లేదంటూ నేటి మధ్యాహ్నం ప్రీతి తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు.