తెలంగాణలో పార్టీలు, నేతలు వ్యూహప్రతివ్యూలతో రాజకీయ కాకను ఎప్పటికప్పుడు రగిలిస్తూనే ఉన్నారు. అసలే ఎలక్షన్ ఇయర్ కావడంతో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా ప్రత్యర్థులను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ బీజేపీ మధ్య ఈ వార్ మరింత జోరుమీద ఉంది.


రాజకీయాల్లో భాగంగా కేంద్రం నుంచి వచ్చిన నిధులుపై తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ప్రశ్నిస్తుంటే ఇప్పటి వరకు ఇచ్చిన నిధుల సంగతి ఏంటని నిలదీస్తున్నారు కేంద్రమంత్రులు. తాజాగా కంపా నిధులపై ఇరు వర్గాల మధ్య మరోసారి మాటల తూటాలు పేలుతున్నాయి. కంపా నిధులు సరిగా కోవడం లేదని కిషన్ రెడ్డి ఓ లేక రాయడం తాజాగా తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 


కిషన్ రెడ్డి కేసీర్‌కు రాసిన లేఖ సారాంశం ఇదే!


అడవుల పెంపకం కోసం కాంపా నిధులను గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినా తెలంగాణ వాడుకోవడం లేదంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. గత మూడేళ్లలో కేంద్రం విడుదల చేసిన నిధుల్లో సుమారు రూ. 610 కోట్లు వాడుకోలేదని లేఖలో పేర్కొన్నారు. 2019-20 నుంచి 2021-22 వరకు గత 3 ఏళ్ల గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం నిధులను పూర్తి స్థాయిలో వాడుకోలేకపోయిందని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.


2019-20లో కేంద్రం రూ. 501కోట్లను విడుదల చేస్తే అందులో అందులో రూ. 260 కోట్లను మాత్రమే వినియోగించుకున్నారని తెలిపారు కిషన్ రెడ్డి. 2020-21లో రూ. 483 కోట్లు రిలీజ్ చేస్తే వాటి నుంచి రూ. 378 కోట్లను వాడుకున్నారని అన్నారు. 2021-22లో రూ. 752 అప్రూవ్ చేస్తే అందులో నుంచి రూ. 488 కోట్లను మాత్రమే యుటిలైజ్ చేసుకున్నారని లేఖలో వివరించారు. మొత్తంగా 609 కోట్లను నిరుపయోగంగా మార్చారని లేఖలో వెల్లడించారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, పార్కులు, జంతు ప్రదర్శనశాలల నిర్వహణ కోసం కూడా విడతలవారీగా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నదని, ఇప్పటివరకు దాదాపు రూ. 30 కోట్లు రాష్ట్రానికి ఇచ్చినట్టు లేఖలో కిషన్ రెడ్డి ప్రస్తావించారు. ఈ నిధులను కూడా సరిగా వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. మోసపూరిత హామీలతో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కల్వకుంట్ల కుటుంబానికి మరోసారి అధికారంలోకి రావాలనే ఆలోచనే తప్ప .. తెలంగాణ అభివృద్ధి కోసం ఏదైనా చేయాలనే ధ్యాసే లేదని కిషన్ రెడ్డి విమర్శించారు.




విమర్శలు చేసే ముందు కిషన్ రెడ్డి క్రాస్ చెక్ చేసుకోవాలి- వినోద్ కుమార్


కిషన్ రెడ్డిన రాసిన లేఖకు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్. అడవుల విస్తరణలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం టాప్ పొజిషన్లో ఉందన్నారు. ఇదే విషయం నీతి ఆయోగ్ నివేదికలో ఉందని, ఆ సంగతి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలుసుకోవాలని సూచించారు. వన్యప్రాణుల సంరక్షణలో తెలంగాణయే భేష్ అన్నారాయన.


కరోనా కాలంలోనూ ( 2019-20, 2020-21, 2021-22 ) పెద్ద ఎత్తున కాంపా నిధులు  వినియోగించుకున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వినోద్‌కుమార్‌ గుర్తు చేశారు. కిషన్ రెడ్డి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. ఐఎస్ఎఫ్ఆర్ నివేదిక ప్రకారం 2015-2021 కాలంలో తెలంగాణ రాష్ట్రంలో 7.7 శాతం అడవుల విస్తీర్ణం పెరిగిందని, 2019-2021 కాలంలో 3.07 శాతం అడవుల విస్తీర్ణం పెరిగిందని వినోద్ కుమార్ తెలిపారు. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఎస్.డీ.జీ. 4వ ర్యాంక్ లో మెరుగు పడిందని, ఐ.ఎస్.ఎఫ్.ఆర్. నివేదిక ప్రకారం అటవీ ప్రాంతంలో నీటి లభ్యత పెరిగిందని, అటవీ ప్రాంతంలో గిరిజనులకు, మహిళలకు ఉపాధి అవకాశాలు పెరిగాయని వినోద్ కుమార్ వివరించారు.


తెలంగాణ రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం పెరిగిందని, గ్రీనరీ పెరిగిందని, వన్యప్రాణుల సంరక్షణ బాగుందని, కాంపా నిధుల వినియోగం బాగుందని పార్లమెంటులో కేంద్ర మంత్రులు పలుమార్లు పేర్కొన్న విషయం తెలుసుకోవాలి అని వినోద్ కుమార్ అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు ఒకటికి నాలుగు సార్లు వాస్తవాలను తెలుసుకుంటే మంచిది అని, మీరు చేసిన ప్రకటన సరి చూసుకోవాలని వినోద్ కుమార్ సూచించారు.