మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణను సీబీఐ కోర్టు మార్చి నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో విచారణకు హాజరైన అందరు నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. వారిని చంచల్ గూడ జైలుకు తరలించాలని ఆదేశించింది. విచారణ కోసం నిందితులు ఏ2 - సునీల్ యాదవ్, ఏ3 - ఉమాశంకర్ రెడ్డి, ఏ5 - శివ శంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు సీబీఐ కోర్టులో హాజరుపర్చారు. కడప జైలులో ఉన్న నిందితులను బందోబస్తు మధ్య ఇవాళ (ఫిబ్రవరి 10) తెల్లవారుజామున హైదరాబాద్ కు తీసుకువచ్చారు. వీరిలో సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. ఏ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, ఏ4 గా ఉన్న డ్రైవర్ దస్తగిరి మాత్రం ఈ కేసులో ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.
ఉమాశంకర్ రెడ్డి ఉన్న వాహనం తొలుత ట్రాఫిక్‌లో నిలిచిపోవడంతో మిగిలిన నిందితులను తొలుత కోర్టులో హాజరుపరచలేదు. అతడు వచ్చే వరకు విచారణను సీబీఐ కోర్టు కాసేపు వాయిదా వేసింది. ఉమాశంకర్ రెడ్డి వచ్చిన తర్వాత విచారణ ప్రారంభించిన సీబీఐ కోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేసింది. నిందితుల్లో శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ ఇప్పటికే కడప జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉండటంతో వారిని చంచల్‌గూడ జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. మరో ఇద్దరు నిందితులు ఎర్ర గంగిరెడ్డి, అప్రూవర్‌గా మారిన దస్తగిరి బెయిల్‌పై బయట ఉన్నారు.
కేసు విచారణ ఏపీ నుంచి తెలంగాణకు
వివేకా హత్య కేసు విచారణను కొద్దిరోజుల క్రితం ఏపీ నుంచి తెలంగాణకు సుప్రీం కోర్టు ట్రాన్స్‌ఫర్ చేసిన విషయం తెలిసిందే. కేసు బదిలీ నేపథ్యంలో సీబీఐ అధికారులు కడప జిల్లా సెషన్స్ కోర్టులో ఉన్న హత్య కేసుకి సంబంధించిన అన్ని ఫైళ్లు, ఛార్జ్ షీట్లు, సాక్షుల వాంగ్మూలాలు, దస్త్రాలను మూడు బాక్సుల్లో హైదరాబాద్ ప్రిన్సిపల్ సీబీఐ కోర్టుకు ఇప్పటికే తీసుకొచ్చారు.
టీడీపీ పోరు, పుస్తకం విడుదల
ఏపీలో నాలుగేళ్ల క్రితం మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగింది. ఈ కేసులో నిందితుల్ని తేల్చేందుకు ప్రస్తుతం సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో వైఎస్ఆర్ సీపీకి చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు పలువురు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ హత్య ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? ఎవరు హత్య చేశారు? అనే వివరాలు కప్పిపుచ్చేందుకు జరిగిన ప్రయత్నాలపై ‘‘జగనాసుర రక్త చరిత్ర’’ పేరుతో ఓ పుస్తకాన్ని విడుదల చేసింది.
వైఎస్ఆర్ సీపీ అధినేత, సీఎం జగన్ ను లక్ష్యంగా చేసే విధంగా ఈ పుస్తకాన్ని రూపొందించారు. వివేకా హత్యకు కారకులెవరు, ఆ రోజు ఏం జరిగింది వంటి అంశాలను పుస్తకంలో రాశారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్న వేళ జనంలోకి వివేకా హత్యను విస్తృతంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో టీడీపీ ఈ పుస్తకాన్ని తయారు చేసినట్లు అర్థం అవుతోంది. జగనాసుర రక్తచరిత్ర పుస్తకాన్ని విడుదల చేయడం ద్వారా వివేకా కేసులో ఏం జరిగిందో జనాలకు తెలుస్తుందని టీడీపీ చెబుతోంది.