Formula ERacing: తెలంగాణ ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూస్తున్న ఫార్ములా ఈ రేస్ రేపటి నుంచి అంటే శనివారం రోజు నుంచే ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.  హుస్సేన్ సాగర్ తీరాన రేపటి నుంచి రయ్ రయ్ మంటూ స్పోర్ట్స్ కార్లు దూసుకెళ్లనున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ గార్డెన్ నుంచి ఐమ్యాక్స్ మీదుగా 2.8 కిలోమీటర్లు దీనికోసం సర్క్యూట్ ను తీర్చిదిద్దారు. ఫిబ్రవరి 11వ జరగనున్న ఈ రేస్ లో 11 ప్రముఖ ఆటో మొబైల్ సంస్థలకు చెందిన ఎలక్ట్రికల్ కార్లు ఈ రేసులో పాల్గొననున్నాయి. 22 మంది డ్రైవర్లు తమ సత్తా చాబోతున్నారు. 208 కిలోమీటర్లలో మొత్తం 18 మలుపులు ఉన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే సందర్శకుల కోసం 11 స్టాండ్లు, 7 గేట్లను కూడా ఏర్పాటు చేశారు.


వారం రోజుల ముందు నుంచే ఆంక్షలు..


ఈ రేస్ లో పాల్గొనబోయే కార్లు గంటకు 280 కిలో మీటర్ల గరిష్టవేగంతో ప్రయాణించగలమని... 250 కేవీ పవన్ ద్వారా 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 2.8 సెకన్లలోనే అందుకుంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు. మన దేశంలో నిర్వహించబోయే మొట్టమొదటి ఫార్ములా ఈ రేసింగ్ కు ఏర్పాట్లు చురుగ్గా పూర్తి చేశారు. వారం రోజుల ముందు నుంచే ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. స్ట్రీట్ సర్క్యూట్ కు రెండు వైపులా భారీ ఎత్తున బారికేడ్లు, ప్రేక్షకుల కోసం గ్యాలరీలు సిద్ధం చేశారు. ఐమాక్స్ పక్కన కార్ల షెడ్లతో పాటు వీఐపీల గ్యాలరీల నిర్మాణాలను చేపట్టారు. ఇప్పటికే బుక్ మై షోలో ఈ రేస్ ఫార్ములాకు సంబంధించిన టికెట్లు అమ్మకానికి పెట్టారు. పోటీలకు తరలివచ్చే దేశ, విదేశీ పర్యాటకుల కోసం హుస్సేన్ సాగర్ చుట్టూ సరికొత్త హంగులు తీసుకొస్తున్నారు. 


చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఫ్యాన్లతో వేదిక ఏర్పాటు


ఫార్ములా ఆ రేస్ సందర్భంగా ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. ఈ కార్లలో ఫిట్టింగ్ తో  పాటు వాటి నిర్వహణ తదితర అంశాలను ఇంజినీర్లతో కలిసి పర్యవేక్షించారు. భద్రత దృష్ట్యా ఇతరులను కార్ల విడి భాగాల ప్రదేశాన్ని సందర్శించడానికి అనుమతిని నిరాకరించారు. పీపుల్‌ ప్లాజాలో చిన్నారుల కోసం ఫ్యాన్ విలేజీ వేదికను ఏర్పాటు చేసారు. ఈ రేసింగ్ చూసేందుకు వచ్చే చిన్నారులు, విద్యార్థులు, యువత కోసం ఈ వేదికను ఏర్పాటు చేసినట్లు నిర్వాకులు చెప్పారు. వినోదాత్మక కార్యక్రమాలతో ఈ వేదిక ద్వారా చిన్నారులు ఉత్సాహంగా గడిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందిరాగాంధీ వద్ద ఓ వేదికను ఏర్పాటు చేశారు. 


ఈ రేస్ ను ఉచితంగా కూడా వీక్షించే అవకాశం..


హుస్సేన్ సాగర్ లోపల 7 కోట్లతో నీటిపై తేలే మ్యూజికల్ ఫౌంటెయిన్, లేజర్ షో ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించిన పనులు కూడా పూర్తయ్యాయి. పోటీలు జరిగే నాలుగైదు రోజుల ముందు ఇవి ప్రారంభం కానున్నాయి. లేజర్ షోలో హైదరాబాద్ సంస్కృతి సంప్రదాయాలు తెలిపే ఘట్టాలను ప్రదర్శించనున్నారు. పర్యాటక శాఖ నడిపే పడవల్లో వెళ్లి తిలకించే అవకాశం కల్పిస్తున్నారు. అంతేకాక రోడ్డుపై నిలబడి పర్యాటకులు ఉచితంగానే ఈ షోను వీక్షించవచ్చు. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఫార్ములా ఈ రేస్ తర్వాత మ్యూజికల్ ఫౌంటెయిన్, లేజర్ షో కొనసాగనుంది. ఈ రేస్, కోసమే కాకుండా మ్యూజికల్ ఫౌంటెయిన్, లేజర్ షో కోసం భాగ్యనగర వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.