వివేక హత్య కేసులో ఏ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. దీనిపై విచారించిన కోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది కేసును 29కి వాయిదా వేసింది.  


వివేక హత్య కేసులో కీలకంగా వ్యవహరించిన ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దు కోరుతోందీ సీబీఐ. గతంలో సిట్ విచారణ చేస్తున్న టైంలో టెక్నికల్‌గా గంగిరెడ్డికి బెయిల్ వచ్చింది. 90 రోజుల్లో ఛార్జిషీట్ వేయలేదన్న కారణంతో అప్పట్లో గంగిరెడ్డికి బెయిల్ వచ్చింది. ఈ కేసులో సీబీఐ వచ్చినప్పటి నుంచి గంగిరెడ్డి బెయిల్ రద్దు కోసం ప్రయత్నిస్తోంది. కానీ వివిధ కారణాలతో అది వీలుపడటం లేదు. ఇప్పుడు మరోసారి గంగిరెడ్డి బెయిల్‌పై సీబీఐ న్యాయపోరాటం చేస్తోంది. 


వివేక హత్య కేసులో ఏ1 ఉన్న గంగిరెడ్డి 2019 మార్చి 28న అంటే నాలుగేళ్ల క్రితం అరెస్టు అయ్యారు. అప్పట్లో ఈ కేసును విచారించిన సిట్‌ ఆయన్ని అదుపులోకి తీసుకొని విచారించింది. అయితే నిందితుడిని అరెస్టు చేసిన 90 రోజుల్లో ఛార్జిషీట్ వేయలేకపోయింది సిట్. దీంతో టెక్నికల్‌గా గంగిరెడ్డికి బెయిల్ ఇస్తున్నట్టు పులివెందుల కోర్టు తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన బయటే ఉన్నారు. 


తర్వాత వివేక హత్య కేసు ఫైల్‌ సిట్‌ చేతుల నుంచి సీబీఐ టేబుల్‌పైకి వచ్చింది. పలువురిని పలుదఫాలుగా విచారించిన సిబీఐ, కీలక సాక్ష్యాలతో 2021 అక్టోబర్‌లో మొదటి ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో మరింత ముందుకు వెళ్లాలంటే గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా పిటిషన్ వేసింది. కేసును పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీబీఐ వేసిన  బెయిల్‌ రద్దు పిటిషన్ కొట్టేసింది. 


ఏపీ హైకోర్టు నిర్ణయంపై సుప్రీం కోర్టుకు వెళ్లింది సీబీఐ. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని రిక్వస్ట్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ విచారణలో ఉండగానే... వివేక హత్య కేసును ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు బదిలీ అయిపోయింది. దీంతో బెయిల్ రద్దు పిటిషన్‌ సుప్రీంకోర్టు విచారణకు వచ్చింది. ముందు తెలంగాణ హైకోర్టులో తేల్చుకున్నాకే తమ వద్దకు రావాలని చెప్పింది దేశఅత్యున్నత ధర్మాసనం. 


సుప్రీం కోర్టు చెప్పిన నిర్ణయంతో మళ్లీ తెలంగాణ హైకోర్టు మెట్లు ఎక్కింది సీబీఐ. వివేక హత్య కేసు మరింత వేగంగా ముందుకు వెళ్లాలంటే గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని అభిప్రాయపడింది. ఆయన బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది. 
సీబీఐ వేసిన పిటిషన్‌ను విచారించిన తెలంగాణ హైకోర్టు... గంగిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. సీబీఐ పిటిషన్‌కు సమాధానం చెప్పాలని ఆదేశించింది. అనంతరం కేసును 29కి వాయిదా వేసింది. 


ఇప్పటికే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ఆలస్యం కావడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విచారణ పురోగతిని సీల్డ్ కవర్‌లో అందచేయాలని ఆదేశించింది. కేసు విచారణను దర్యాప్తు అధికారి ఎందుకు పూర్తి చేయడం లేదని... వివేకా హత్య కేసు విచారణను త్వరగా ముగించలేకపోతే  వేరే దర్యాప్తు అధికారిని ఎందుకు నియమించకూడదని  సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ అంశంపై  సీబీఐ డైరక్టర్‌ అభిప్రాయం తెలుసుకుని చెప్పారని సీబీఐ తరపు లాయర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.  కేసు విచారణలో ఆలస్యం చేస్తున్నారని దర్యాప్తు అధికారిని మార్చాలంటూ నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా జరిగిన విచారణలో కేసును దర్యాప్తు అధికారి సక్రమంగానే దర్యాప్తు చేస్తున్నారని సీబీఐ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు.