టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో 9 మంది నిందితులను అదుపులోకి తీసుకుని అధికారులు ప్రశ్నిస్తున్నారు. వారి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కాల్‌డేటాను పరిశీలించారు. పరీక్ష నిర్వహించిన సమయంలో ఎక్కువగా ఎవరెవరితో మాట్లాడారనే విషయాన్ని తెలుసుకొని వారందరికీ నోటీసులు జారీ చేశారు.
అంతేకాకుండా నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డికి టీఎస్‌పీఎస్సీలో ఎవరు సహకరించారనే దానిపై సిట్ అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో ఇప్పటికే టీఎస్‌పీఎస్సీలో పనిచేస్తూ 10 మందికి పైగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాసి మెయిన్స్‌కు అర్హత సాధించినట్లు సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వారిని కార్యాలయానికి పిలిచి విచారించారు.
లీకేజీకి సంబంధించి దాదాపు 40మంది సిబ్బందికి కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇందులో కొందరికి 100 మార్కులకుపైగా వచ్చినట్లు సమాచారం. టీఎస్‌పీఎస్సీ నుంచి మరిన్ని వివరాలు రావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల వస్తే టీఎస్‌పీఎస్సీ సిబ్బంది ఎంతమంది గ్రూప్-1 ప్రిలిమ్స్ రాశారు? ఇందులో ఎంతమందికి 100 మార్కులు వచ్చాయి? అనే విషయంపై సిట్ అధికారులకు స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.
మరోవైపు నిందితురాలు రేణుక, ఆమె భర్త డాక్యా నాయక్ పలువురు పోటీ పరీక్షల అభ్యర్థులతో పాటు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులతో మాట్లాడినట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. రేణుక కాల్ డేటా ఆధారంగా అభ్యర్థులతో పాటు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు ఈకేసులో 9మంది నిందితుల 5వ రోజు కస్టడీ ముగిసింది. నిందితులను సిట్ కార్యాలయం నుంచి మధ్య మండల డీసీపీ ఆఫీసుకు తరలించారు.
Also Read:
'గ్రూప్-1' పేపర్ మొదటి టార్గెట్, జూన్‌లోనే పేపర్ లీకేజీకి స్కెచ్!
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో నిందితుల నుంచి సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన నిందితులైన ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి గ్రూప్-1 పేపర్ కోసం జూన్ నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టి, అక్టోబర్ మొదటి వారంలో పేపర్‌ను అపహరించినట్లు విచారణలో వెల్లడైంది. పేపర్ లీకేజీ ఘటనలో నిందితులుగా 9 మందిని మూడో రోజు సిట్ అధికారులు విచారించారు. వీరి నుంచి పలు ప్రశ్నలపై సమాధానాలు రాబట్టారు. మొదటి రెండు రోజులు ఒక్కొక్కరిని, ఇద్దరిద్దరిని కలిపి విచారించిన సిట్, మూడో రోజు కొద్ది సేపు అందరినీ కలిపి విచారించింది.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..
'గ్రూప్-1' పేపర్ లీకేజీలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థుల జాబితా సిద్ధం!
తెలంగాణలో రోజురోజుకి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం మరింత వేడెక్కుతోంది. 'గ్రూప్-1' ప్రశ్నపత్రాన్ని రాజశేఖర్ రెడ్డి ముఠా అనేక మందికి అమ్మినట్లు సిట్ భావిస్తోంది. ప్రస్తుతం ఎవరెవరికి అందిందనేది నిగ్గు తేల్చేందుకు ప్రయత్నిస్తోంది. గ్రూప్-1 పరీక్షలో సుమారు 25 వేల మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. అందులో 100 స్కోర్ దాటిన వారు ఎంతమంది ఉన్నారు? వారికి ప్రవీణ్, రాజశేఖర్, రేణుకకు ఎలాంటి సంబంధాలున్నాయనే అంశాలపై ఫోకస్ పెట్టారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం 100కు పైగా మార్కులు సాధించిన 'గ్రూప్-1' అభ్యర్థుల జాబితా రూపొందించిన సిట్ అధికారులు వారిలో అనుమానితులను విచారించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..