Vandebharat: దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత అందుబాటులోకి తీసుకువస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 51 రైళ్లు పట్టాలెక్కాయి. వివిధ రాష్ట్రాలు/నగరాల మధ్య ఈ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో సాధారణ రైళ్లలో లేని కొన్ని ప్రత్యేక ఫీచర్లు , వేగం ఉండటంతో వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో కూడా ఎక్కువగా ఉంటోంది. సాధారణ రైళ్లతో పోలిస్తే టిక్కెట్ ధర ఎక్కువగా ఉన్నప్పటికీ - ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వేగంగా చేరుకోవడానికి వందే భారత్ వైపు మొగ్గు చూపుతున్నారు.


ఇక మంగళవారం సెలవు
విశాఖపట్నం- సికింద్రాబాద్‌ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రీషెడ్యూల్ అయింది. ఈ మేరకు అధికారులు ప్రయాణికులకు తెలియజేశారు.  డిసెంబర్‌ 10 నుంచి ఈ రైలుకు ప్రతి మంగళవారం సెలవు ప్రకటించారు. ప్రస్తుతం ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఈ రైలు నడుస్తోంది. విశాఖ-సికింద్రాబాద్ మధ్య రెండు వందేభారత్ రైళ్లు నడుస్తున్న విషయం తెలిసిందే.  ఈ రూట్లో ఇప్పటికే పలు ఎక్స్ ప్రెస్ రైళ్లు ఉన్నప్పటికీ, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండో వందేభారత్ రైలును కూడా కేంద్రం ఈ ఏడాది మార్చి నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది ప్రభుత్వం.


అత్యంత దూరం నడిచే రైలు ఇదే 
విశాఖ  నుంచి సికింద్రాబాద్ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా, ప్రయాణికులకు భారత ప్రభుత్వం ఈ రైలు ద్వారా అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తోంది. ఇప్పటి వరకూ నడుస్తున్న వందే భారత్ రైళ్లలో కెల్లా అత్యధిక దూరం ప్రయాణించే రైలు కూడా ఇదే.  ఈ రైలు  సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం స్టేషన్లలో మాత్రమే రైలు ఆగుతుంది.


వందే భారత్ ట్రైన్ స్పెషాలిటీస్..
సికింద్రాబాద్  నుంచి విశాఖ దూరం 698 కిలోమీటర్లు ఉంటుంది. వందేభారత్ ట్రైన్ కేవలం  8 గంట‌ల 40నిమిషాల్లో చేరుకుంటుంది. మిగిలిన రైళ్లకు 12 గంటలకు పైగానే సమయం పడుతుంది. వందే భారత్ గరిష్ట వేగ పరిమితి గంటకు 180 కిలోమీటర్లు. సికింద్రాబాద్‌– విశాఖ మధ్య వేగ పరిమితి 130 కి.మీ. 140 సెకన్లలో గరిష్ట వేగాన్ని ఈ ట్రైన్ అందుకుంటుంది. ఫుల్లీ సస్పెండెడ్‌ ట్రాక్షన్‌ మోటార్‌తో రూపొందించిన ఆధునిక బోగీలను ఈ రైలులో వినియోగించారు. రైలు ఎంత వేగంతో వెళ్లినా కుదుపులు ఉండవు.వందే భారత్ రైళ్లలో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. ఇందులో 14 ఏసీ చైర్‌ కార్లు కాగా, రెండు బోగీలు ఎగ్జిక్యూటివ్‌ ఏసీ కార్‌ కోచ్‌లు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఏసీ కార్ కోచ్‌లో 104 సీట్లు ఉన్నాయి. ఎకానమీ క్లాస్‌లో 1,024 సీట్లు ఉంటాయి. ఈ రైలులో మొత్తం 1,128 మంది ప్రయాణించవచ్చు. రెగ్యులర్ బుకింగ్ కింద 806 సీట్లు, తత్కాల్ బుకింగ్ కింద 322 సీట్లు కేటాయించారు.



సికింద్రాబాద్ నుంచి టైమింగ్స్  
మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్‌లో స్టార్ట్ మధ్యాహ్నం 4.35 గంటలకు వరంగల్ మధ్యాహ్నం 5.45 గంటలకు ఖమ్మం సాయంత్రం 7 గంటలకు విజయవాడ రాత్రి 8.50 గంటలకు రాజమండ్రి రాత్రి 11.30 గంటలకు విశాఖపట్నం


విశాఖ నుంచి బయలుదేరే టైమింగ్స్ 
ఉదయం 5.45కు వైజాగ్‌లో స్టార్ట్ ఉదయం 7.55 గంటలకు రాజమండ్రి ఉదయం 10 గంటలకు విజయవాడ ఉదయం 11 గంటలకు ఖమ్మం మధ్యాహ్నం 12.05 గంటలకు వరంగల్ మధ్యాహ్నం 2.15కు సికింద్రాబాద్