Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రఖ్యాత అడోబ్​ సిస్టమ్స్ (Adobe Systems) సీఈవో శంతను నారాయణ్‌ తో  భేటీ అయ్యారు. ఫ్యూచర్ స్టేట్ తెలంగాణకు పెట్టుబడులు  లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కాలిఫోర్నియాలోని పలువురు గ్లోబల్ బిజినెస్ లీడర్లతో చర్చలు జరిపారు. అడోబ్​ సీఈవోతో సమావేశంలో సీఎంతోపాటు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.


 తెలంగాణలో ప్రజాప్రభుత్వం తలపెట్టిన హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ నిర్మాణం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు  ప్రణాళికలపై శంతను నారాయణ్​ ఆసక్తి  చూపారు. రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు ఓకే చెప్పారు. టెక్ విజనరీ శంతను నారాయణ్ ను కలుసుకోవటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.  


అమెరికాలో రేవంత్‌ బిజిబిజి
ఐటీ సంస్థలకు హైదరాబాద్‌(Hyderabad) స్వర్గధామమని ముఖ‌్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) టెక్‌ సంస్థలను ఆహ్వానించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో పర్యటించిన ఆయన...ఐటీ సర్వీసెస్ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఐటీ సంస్థల అసోసియేషన్ ఐటీ సర్వ్‌ అలయన్స్ సమావేశంలో సీఎం బృందం పాల్గొంది. హైదరబాద్‌ను మరింతగా విస్తరిస్తున్నామని..కొత్తగా నాల్గవ సిటీ నిర్మాణం చేపట్టామని సీఎం రేవంత్‌రెడ్డి వారికి వివరించారు. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా నూతన సిటీ నిర్మాణం సాగుతుందని ఆయన వివరించారు. ఇప్పుడు ఉన్న ఐటీ నగరం సైబరాబాద్‌ కన్నా మిన్నగా తీర్చిదిద్దుతామన్నారు. ఇందులో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆయన ఐటీ సంస్థలకు పిలుపునిచ్చారు. జంటనగరాలుగా పేరుగాంచిన హైదరాబాద్‌, సికింద్రాబాద్ సిటీల నిర్మాణం ఎంతో పురాతనమైనదని.. వాటికి దీటుగా సైబరాబాద్‌ నిర్మాణం జరిగిందని....ఇప్పుడు  తెలంగాణ(Telangana)- ద ప్యూచర్ స్టేట్‌ నినాదం ఎత్తుకున్నామని రేవంత్‌రెడ్డి పెట్టుబడిదారులకు వివరించారు.  అందుకే అందరి భాగ్యస్వామ్యంతో నాల్గవ నగరం నిర్మాణం చేపడదామన్నారు. హైదరాబాద్‌(Hyderabad)లో పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి తప్పకుండా డబుల్‌ వస్తుందని ఇది ఇప్పటికే నిరూపతమైందని ఆయన చెప్పారు. 


టెక్నాలజీ నగరం
హైదరాబాద్‌లో పునర్నాణంలో భాగంగా మెట్రో విస్తరణ, మూసీ నది ప్రక్షాళన చేపట్టామని సీఎం వివరించారు. హైదరాబాద్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెంలిజెన్స్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామనన్నారు.  హైదరాబాద్‌తో పాటు మిగిలిన నగరాలకు ఐటీని విస్తరిస్తున్నామని ఆ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు(Sridher Babu) తెలిపారు.రాబోయే దశాబ్దకాలంలో తెలంగాణ ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవ్థగా అభివృద్ధి చెందనుందని...ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ఎంతో ఉపయోగకరమన్నారు. ఈ ఏడాది చివరిలో ఐటీ సర్వ్‌ అలయెన్స్ వార్షికోత్సవం జరగనుంది..ఈ వేడుకకు అమెరికా మాజీ అధ్యక్షులు బిల్‌క్లింటన్‌, జార్జి బుష్, హిల్లరీ క్లింటన్‌ వంటి ప్రముఖులు రానున్నారని...ఆ కార్యక్రమానికి మీరు కూడా రావాలని రేవంత్‌రెడ్డిని అలయెన్స్‌ ప్రతినిధులు ఆహ్వానించారు. 


యాపిల్‌ కార్యాలయంలో రేవంత్‌
ప్రపంచవ్యాప్తంగా యాపిల్‌ ఉత్పత్తులకు ఉన్న క్రేజ్ వేరు. లక్షల కోట్ల బ్రాండ్ విలువ కలిగిన ఈ సంస్థ ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం ఈ కార్యాలయాన్ని సందర్శించింది. ఎలక్ట్రానిక్స్ పార్కు, స్కిల్ యూనివర్సిటీ, ఏఐ సిటీ తదితర కార్యాలయాలను రేవంత్‌రెడ్డి బృందం సందర్శించింది. హైదరాబాద్‌లో యాపిల్ ఉత్పత్తుల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని రేవంత్‌రెడ్డి బృందం సంస్థ ప్రతినిధులను కోరింది. హైదరాబాద్‌లో సంస్థ విస్తరణకు మొగ్గు చూపితే అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపింది.


ఇప్పటికే పలు సంస్థలతో రేవంత్‌రెడ్డి బృందం ఒప్పందాలు చేసుకుంది. ముఖ్యమంత్రి పర్యటన రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరంగా మారనుందని...బడాబడా సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. మరికొన్ని ఒప్పందాలు చేసుకోనున్నట్లు మంత్రి దుద్దిళ్ల  శీధర్‌బాబు  వెల్లడించారు.