Vande Bharat Train: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు యువతలో మంచి డిమాండ్ ఉంది. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారికంగా ప్రకటించింది. జోన్ పరిధిలో మొత్తం ఐదు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైళ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 7.16 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వీరిలో 56 శాతం మంది యువకులు, ఉద్యోగులేనని పేర్కొంది. సగటున 25-34 సంవత్సరాల మధ్య వయస్సున్న యువకులు 29.08 శాతం మంది వందేభారత్ రైళ్లలో ప్రయాణించినట్లు తెలిపింది.
అలాగే 35 - 49 సంవత్సరాల మధ్య వయస్సు వారు 26.85 శాతం మంది వందేభారత్‌లో ప్రయాణించారట. సీనియర్ సిటిజన్లు 11.81 శాతం మంది ఉన్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రస్తుతం.. సికింద్రాబాద్-విశాఖపట్నం-సికింద్రాబాద్, సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్, కాచిగూడ-యశ్వంతపుర్-కాచిగూడ, విజయవాడ-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- విజయవాడ వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి.
ఇవే ప్రధాన సమస్యలు
వందే భారత్ రైళ్లలో పలు ప్రధాన సమస్యలు ఉన్నాయి. సుదూర ప్రాంతాలకు సైతం కూర్చేనే వెళ్లాలి. దాదాపు ఆరు గంటల కంటే ఎక్కువ సేపు సీటులో కూర్చొని ప్రయాణం చేయాల్సి రావటం, పడుకోవడానికి అవకాశం లేకపోవడంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు విశ్రమించేందుకు స్లీపర్ తరహాలో లేకపోవడంతో ప్రయాణం చేసేందుకు మక్కువ చూపటం లేదనే వాదన బలంగా వినిపిస్తుంది.
టికెట్ ఛార్జీలు సైతం మధ్య తరగతి, దిగువ, పేదలకు అందుబాటులో లేకపోవడం మరొక కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ధరలను బట్టి చూస్తే ఎగువ మధ్య తరగతి, సంపన్న వర్గాలకు మాత్రమే అనుకూలంగా ఉన్నాయనే టాక్ బలంగా ఉంది. యువత, మధ్య వయస్కులు ఎక్కువగా ఇతర ప్రాంతాలకు తిరుగుతుండడంతో వాటికి స్పందన ఉందని అంటున్నారు.
వందే భారత్ రైళ్లలో సౌకర్యాలు మెరుగు
వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో సౌకర్యాలను మెరుగు పరిచినట్లు రైల్వే శాఖ తెలిపింది. ప్రయాణికుల సౌకర్యార్థం మొత్తం 25 రకాలు మార్పులు చేపట్టినట్లు పేర్కొంది. సీట్లలో ఎనిమిదిన్నర గంటల పాటు కూర్చోవాల్సి వస్తుండటంతో అనేక మంది ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా సీట్లు బాగా లేవని చాలా మంది ప్రయాణికులు ఫిర్యాదులు చేశారు. ఈక్రమంలోనే రైల్వేశాఖ అప్రమత్తం అయి పలు మార్పులు, చేర్పులు చేస్తోంది. గంటలపాటు ప్రయాణం చేసే ప్రాయాణికులు హాయిగా పడుకునేలా పుష్ బ్యాక్‌ను, సీట్ల మెత్తదనాన్ని పెంచారు.
మొబైల్ ఛార్జింగ్ పాయింట్‌ను, ఫుట్ రెస్ట్‌ను మెరుగుపరిచారు. అలాగే మరుగు దొడ్లలో వెలుతూరు, వాష్ బేసిన్ల లోతును కూడా పెంచారు. ఇవే కాకుండాఏసీ అధికంగా రావడానికి ప్యానెళ్లలో రైల్వేశాఖ మార్పులు చేసింది. అంతేకాకుండా దివ్యాంగుల వీల్ ఛైర్ కోసం ప్రత్యేక పాయింట్ ను ఏర్పాటు చేసి అక్కడే వారికి సీటు కేటాయించనున్నారు. అత్యవసర సమయాల్లో ప్రయాణికులు లోకో పైలట్ తో మాట్లాడేందుకు బోర్డర్ లెస్ ఎమర్జెన్సీ బ్యాక్ యూనిట్ లు ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులకు సులువుగా అందుబాటులో ఉండేలా హ్యామర్ బాక్స్ కవర్ లో మార్పులు చేస్తారు.
కోచ్ లో అగ్ని ప్రమాదాలను గుర్తించే ఏరోసోల్ ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ ను మరింతగా మెరుగుపరుస్తారు. ఎయిర్ టైట్ ప్యాన్సల్స్ లో మార్పులు చేయనున్నారు. ఎమర్జెన్సీ పుష్ బటన్ ను మరింత సులువు చేయనున్నారు. కోచ్ కు కోచ్ కు మధ్య అసెంబ్లీ యూనిట్ డోర్ ప్యానల్స్ ను మరింత పారదర్శకంగా రూపొందిస్తారు. టాయిలెట్లలో లైటింగ్ మెరుగుపరుస్తారు. 1.5 వాట్ల నుంచి 2.5 వాట్ లకు పెంచుతారు. నీటి ప్రవాహం మరింత మెరుగుపడేలా వాటర్ ట్యాప్ ఏరేటర్లు ఏర్పాటు చేస్తారు.