తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న ఆశావహుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. బీఆర్ఎస్ అభ్యర్థులు ఇప్పటికే ఒక రౌండ్ ప్రచారం ముగించేశారు. రెండో రౌండ్ రెడీ అవుతున్నారు. అధికార బీఆర్​ఎస్ పార్టీ టికెట్లు ప్రకటించి బీ-ఫారాలు కూడా ఇచ్చేసింది. కాంగ్రెస్ నుంచి దక్కించుకున్న అభ్యర్థులు ప్రచారం మొదలు పెడితే, ఇంకా సీటు రాని నేతలు ఆందోళనకు గురవుతున్నారు. నేడు ఢిల్లీలో జరగనున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో రెండో జాబితాకు సీఈసీ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. మొదటి జాబితా 55 నియోజవర్గాలను మినహాయిస్తే మిగిలిన 64 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. 


శని, ఆదివారాలలో దిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం అయింది. స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్, ఇద్దరు సభ్యులు, రేవంత్ రెడ్డి, ఠాక్రే, ఏఐసీసీ ఇంఛార్జి కార్యదర్శులు, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమకుమార్ రెడ్డి, కాంగ్రెస్ రాజకీయ వ్యూహ కర్త సునీల్ కనుగోలు పాల్గొన్నారు. స్క్రీనింగ్ కమిటీలో నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై కలిసి వచ్చే అంశాలతో పాటు మైనస్ పాయింట్లపై చర్చించారు. రెండో జాబితా అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్‌ సీఈసీ సమావేశానికి ఒకే పేరు ఉన్న నియోజకవర్గాలతో పాటు.. జటిలంగా మారిన నియోజకవర్గాల్లో రెండు పేర్లను కూడా స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. 


మరొకవైపు బీఆర్ఎస్, బీజేపీ నుంచి కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఇవాళ జరగనున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి స్క్రీనింగ్ కమిటీ పంపించిన జాబితాకు ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. ఏకాభిప్రాయం కుదిరిన 35 నుంచి 40 నియోజకవర్గాలకు రెండో జాబితాలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. నేడు లేదా గురువారాల్లో రెండో జాబితా ప్రకటించే అవకాశం ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో తమకు అనుకూలమైన నాయకులను ఎంపిక చేసుకునేందుకు నేతలు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. సూర్యాపేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, అంబర్‌పేట, ఎల్బీ నగర్‌, నర్సాపూర్‌ తదితర పదికి పైగా నియోజకవర్గాలకు ఇద్దరు సమ ఉజ్జీలు ఉన్నారు. దీంతో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో స్క్రీనింగ్ కమిటీ రెండేసి పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీకి ప్రతిపాదించింది. మొత్తం 64 నియోజకవర్గాల్లో, మెజార్టీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ఏకాభిప్రాయం కుదరలేదు.