ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఓటర్ల జాబితాపై దుమారం రేగుతూనే ఉంది. దొంగ ఓట్లు చేర్చారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు పలువురు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఫేక్ ఓట్లను తొలగించాలని సీఈసీని కలిశారు. ఉరవకొండ నియోజకవర్గంలో దొంగ ఓట్లు చేర్చడంపై సీఈసీ ఇప్పటికే సీరియస్ అయింది. ఇద్దరు ఉన్నతాధికారులపై వేటు పడింది. తాజాగా బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఓటర్ల జాబితా సవరణలో జోక్యం చేసుకున్న పోలీసులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. మార్టూరు సీఐ టి.ఫిరోజ్‌,  పర్చూరు ఎస్సై ఎన్‌సీ ప్రసాద్, మార్టూరు ఎస్సై కె.కమలాకర్, యద్దనపూడి ఎస్సై కె.అనూక్‌ను జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ సస్పెండ్ చేశారు. 


ఎన్నికల విధుల్లో పాల్గొన్న మహిళా పోలీసులపై నలుగురు అధికారులు, నిబంధనలకు విరుద్ధంగా ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిసింది. ఓట్ల తొలగింపు కోరుతూ వచ్చిన ఫారం-7 దరఖాస్తుల సమాచారాన్ని సేకరించి అధికార పార్టీ నేతలకు చేరవేసినట్లు టీడీపీ గుర్తించింది. వైసీపీ నేతలతో ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి ఓట్ల తొలగింపుపై మాట్లాడుతున్నట్లు ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. విచారణ జరపాలని బాపట్ల జిల్లా కలెక్టర్ కు సీఈఓ ముఖేష్‌కుమార్‌ మీనా ఆదేశించారు. బీఎల్‌వోలు పోలీసు అధికారులకు సమాచారం పంపినట్లుగా విచారణలో వెల్లడైంది. అధికారులపై చర్యలు తీసుకోకపోవడంతో ఎమ్మెల్యే సాంబశివరావు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు, సీఈసీ ఆదేశాలతో పోలీసు ఉన్నతాదికారులు అప్రమత్తమయ్యారు. ఒక సీఐ, ముగ్గురు ఎస్ఐలను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.