PM Modi attends Ravan Dahan at Ram Leela in Delhi:


ఢిల్లీ: మనం ఆయుధాలను ఇతరులను నాశనం చేసేందుకు కాదు, ఆత్మరక్షణ కోసం వాడాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ ఎవరిపైనా ఆధిపత్యం కోసం పాకులాడే దేశం కాదన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దేశమంతా దసరా పండుగ జరుపుకుంటుందన్నారు. ఢిల్లీలోని ద్వారకా సెక్టార్‌- 10లో రామ్‌లీలా మైదానంలో మంగళవారం నిర్వహించిన రావణ్ దహనం కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రామ్ లీలాలో ఏర్పాటు చేసిన రావణుడి దిష్టిబొమ్మను బాణం వేసి ప్రధాని మోదీ దహనం చేశారు. కుంభకర్ణుడు, మేఘనాథుడి దిష్టిబొమ్మల్ని సైతం ఈ సందర్భంగా దహనం చేసి చెడుపై మంచి సాధించిన విజయాన్ని వేడుకగా జరుపుకున్నారు.


సమాజంలో కొన్ని శక్తులు ప్రజలను కులం, మతం అంటూ విభజించాలని చూస్తోందని, ప్రజలు వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. రావణ దహనం అనంతరం ప్రధాని మోదీ మాట్లాడతూ.. చంద్రయాన్ 3 విజయం సాధించిన రెండు నెలల తరువాత విజయదశమి వేడకలు భారత్ ఘనంగా జరుపుకుంటోందన్నారు. కొత్త పార్లమెంట్‌ భవనం ప్రారంభం, మహిళా రిజర్వేషన్‌బిల్లు ఆమోదించుకోవడం మనం సాధించిన విజయాలేనన్నారు. కొన్ని దేశాలు ఆయుధాలను దాడులు, వినాశం కోసం వినియోగిస్తాయాని.. కానీ భారత్ మాత్రం తన ఆయుధాలను ఆత్మరక్షణ కోసం మాత్రమే వాడుతుందన్నారు.


ప్రధాని మోదీ ఇంకా ఏమన్నారంటే.. ‘వందల ఏళ్లపాటు నిరీక్షించాక రామ జన్మభూమి అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించుకుంటున్నాం. మరికొన్ని నెలల్లో రామాలయం నిర్మాణం పూర్తవుతుంది. వచ్చే శ్రీరామనవమి నాటికి కొత్త రామాలయాన్ని దేశం చూడబోతోంది. అయోధ్యలో రామ మందిరం చూడటం మన అదృష్టం. వచ్చే రామనవమి నాడు అయోధ్య రామాలయంలో ప్రతిధ్వనించే ప్రతి రామ నామం ప్రపంచానికి ఆనందాన్ని ఇస్తుంది. ప్రస్తుతం మనం కాల్చింది కేవలం రావణుడి దిష్టిబొమ్మ కాదు. సమాజంలో చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి. మనలో ఉన్న చెడును నాశనం చేద్దాం. దేశాన్ని అభివృద్ధి చేయడానికి కొన్ని ప్రతిజ్ఞలు తీసుకోండి. అప్పుడే దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు వెళ్లడానికి ప్రజలు ప్రతిన చేయాలని’ ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.






ఒక్క పేద కుటుంబం ఆర్థిక, సామాజిక స్థితిని మెరుగుపరిచేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. నీళ్లు ఆదా చేయడం, పరిశుభ్రత పాటించడం, డిజిటల్ పేమెంట్స్ చేయడం లాంటి 10 ప్రతిజ్ఞలు తీసుకోవాలన్నారు. ప్రకృతి వ్యవసాయం, చేసే పని నాణ్యతగా ఉండటం, వోకల్‌ ఫర్‌ లోకల్‌, మిల్లెట్స్ వాడకం, ఆరోగ్యంపై ఫోకస్ చేయాలని సూచించారు.
Also Read: ఐఏఎస్‌కు ఇలా వాలంటరీ రిటైర్మెంట్ - అలా కేబినెట్ హోదాతో పదవి ! వివాదాస్పదమయిన ఒరిస్సా సీఎం నిర్ణయం