Vande Bharat Express: హైదరాబాద్ నుంచి మరో వందేభారత్ రైలు ప్రారంభం కాబోతుంది. భాగ్యనగరం నుంచి బెంగళూరు మధ్య ఈనెల 24 తేదీ ఆదివారం నుంచి వందేభారత్ రైలును ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. కాచిగూడ- యశ్వంత్ పూర్ మధ్య రాకపోకలు సాగించే ఈ రైలును ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ప్రారంభించనున్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్ వేదికగా జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు రైల్వేశాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారు. ప్రస్తుతం రైలులో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లాలంటే రైలు ప్రయాణ సమయం దాదాపు 11 గంటలు పడుతోంది. వందేభారత్ రైలు మాత్రం కేవలం ఎనిమిదిన్నర గంటల్లోనే బెంగుళూరు చేరుకోనుంది. సోమవారం నుంచి ఈ రైలు కాచిగూడలో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి.. మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం స్టేషన్ల మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్ పూర్ చేరుకుంటుంది. అలాగే తిరిగి 2.45 గంటలకు యశ్వంత్ పూర్‌లో బయలుదేరి, రాత్రి 11.15కు కాచిగూడ చేరుకుంటుంది. అయితే ఈ రైలుతో పాటు ఇదే నెల 24వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఒకేసారి 9 వందే భారత్ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.
వాటిలో విజయవాడ - చెన్నై వందేభారత్ కూడా ఉందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు విజయవాడలో ప్రారంభమై తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా చెన్నై సెంట్రల్‌కు చేరుకుంటుంది. గురువారం తప్ప వారంలో మిగిలిన అన్ని రోజుల్లో ఈ రైలు నడుస్తుంది. ఈ రైలు రోజూ ఉదయం విజయవాడలో 5.30 గంటలకు బయలు దేరి మధ్యాహ్నం 12.10 గంటలకు చెన్నై చేరుకుంటుంది. తిరిగి చెన్నైలో మధ్యాహ్నం 3.20 గంటలకు బయలు దేరి విజయవాడకు రాత్రి 10 గంటలకు వెళ్తుంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో తయారైన కాషాయ రంగు వందే భారత్ తొలి రైలును కేరళ రాష్ట్రానికి కేటాయించారు. కాసర్ గోడ్ నుంచి తిరువనంతపురం వయా అలెప్పి మార్గంలో ఈ సర్వీసును నడపాలని రైల్వేబోర్డు అధికారులు దక్షిణ రైల్వే అధికారులకు సమాచారం అందించారు.
విమర్శలకు చెక్ పెట్టబోతున్నారు..!
వందే భారత్ రైళ్లలో సీట్ల కుషన్ గట్టిగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త కోచ్ లలో మెత్తటి కుషన్ లను వాడనున్నారు. ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ సీట్ల రంగును రెడ్ నుంచి బ్లూకు మారుస్తారు. ఫుట్ రెస్ట్ ను మరింతగా పొడగించనున్నారు. దివ్యాంగుల వీల్ ఛైర్ కోసం ప్రత్యేక పాయింట్ ను ఏర్పాటు చేసి అక్కడే వారికి సీటు కేటాయించనున్నారు. అత్యవసర సమయాల్లో ప్రయాణికులు లోకో పైలట్ తో మాట్లాడేందుకు బోర్డర్ లెస్ ఎమర్జెన్సీ బ్యాక్ యూనిట్ లు ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులకు సులువుగా అందుబాటులో ఉండేలా హ్యామర్ బాక్స్ కవర్ లో మార్పులు చేస్తారు.
కోచ్ లో అగ్ని ప్రమాదాలను గుర్తించే ఏరోసోల్ ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ ను మరింతగా మెరుగుపరుస్తారు. ఎయిర్ టైట్ ప్యాన్సల్స్ లో మార్పులు చేయనున్నారు. ఎమర్జెన్సీ పుష్ బటన్ ను మరింత సులువు చేయనున్నారు. కోచ్ కు కోచ్ కు మధ్య అసెంబ్లీ యూనిట్ డోర్ ప్యానల్స్ ను మరింత పారదర్శకంగా రూపొందిస్తారు. టాయిలెట్లలో లైటింగ్ మెరుగుపరుస్తారు. 1.5 వాట్ల నుంచి 2.5 వాట్ లకు పెంచుతారు. నీటి ప్రవాహం మరింత మెరుగుపడేలా వాటర్ ట్యాప్ ఏరేటర్లు ఏర్పాటు చేస్తారు.